అబద్ధాలు.. బద్దలు!

ABN , First Publish Date - 2022-03-18T07:42:24+05:30 IST

ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వంపై తప్పుడు నిందలు! అధికారంలోకి వచ్చాక... అప్పటి ప్రభుత్వం చేసిన లబ్ధిపై తప్పుడు లెక్కలు! కానీ... వారి అబద్ధాల కోటలు అసెంబ్లీ వేదికగానే బద్దలవుతున్నాయి. ‘ఔను..

అబద్ధాలు.. బద్దలు!

  • అసెంబ్లీ వేదికగానే అసలు గుట్టు రట్టు
  • మొన్న డీఎస్పీ పదోన్నతులపై... నేడు పెన్షన్లపై
  • తప్పుడు మాటలు.. తక్కువ లెక్కలని అంగీకారం
  • టీడీపీ హయాంలో 51 లక్షల మందికి పైగా పెన్షన్లు 
  • 39 లక్షల మందే అని వైసీపీ తప్పుడు ప్రచారం
  • రూ.2 వేలకు పెంచడంపైనా అదే తీరు
  • జనవరి 1న కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు
  • ముఖ్యమంత్రి జగన్‌ నోటా అవే అబద్ధాలు
  • టీడీపీ 51 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినట్లు
  • అంగీకరించిన గ్రామీణాభివృద్ధి శాఖ


ఎన్ని నెలలు.. ఎంతమందికి?

‘గత ప్రభుత్వం దిగిపోవడానికి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు. అలాగే, ఆ ప్రభుత్వం దిగిపోవడానికి 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్‌ కేవలం రూ.1000’ 

 వైసీపీ సర్కారు జనవరి 1న పత్రికలకు ఇచ్చిన ప్రకటన


39 లక్షలా... 51 లక్షలా?

‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 3 నెలల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారు. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి మాత్రమే రూ.2 వేలు ఇచ్చారు!’ 

జనవరి 1న బహిరంగ సభలో సీఎం జగన్‌


అసెంబ్లీలో అసలు నిజం

2018 ఏప్రిల్‌ నుంచి 2018 అక్టోబరు మధ్యకాలంలో ప్రతి నెలా 42,66,729 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. 2018 నవంబరు నుంచి 2019 మార్చి వరకు టీడీపీ ప్రభుత్వం 51,66,732 పెన్షన్లు పంపిణీ చేసింది!

అసెంబ్లీలో తాజాగా ప్రభుత్వం చెప్పిన సమాధానం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వంపై తప్పుడు నిందలు! అధికారంలోకి వచ్చాక... అప్పటి ప్రభుత్వం చేసిన లబ్ధిపై తప్పుడు లెక్కలు! కానీ... వారి అబద్ధాల కోటలు అసెంబ్లీ వేదికగానే బద్దలవుతున్నాయి. ‘ఔను.. అప్పుడు చెప్పింది అబద్ధమే’ అని స్వయంగా వైసీపీ మంత్రులే ఒప్పుకొంటున్నారు. ‘టీడీపీ హయాంలో 37 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇస్తే... అందులో 35 మంది చంద్రబాబు కులానికి చెందిన వారే’ అని ఎన్నికల ముందు జగన్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఇటీవలే హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఇప్పుడు... టీడీపీ హయాంలో పెన్షన్‌ లబ్ధిదారుల సంఖ్యపై తాము ‘తక్కువ’ లెక్కలు చెప్పామని అసెంబ్లీ వేదికగా గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించింది. 2014లో అధికారంలోకి రాగానే రూ.200 ఉన్న పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి రూ.వెయ్యికి పెంచారు. అంటే.. ఐదు రెట్లు పెంపు. 2019 జనవరి నుంచి దానిని రూ.2వేలు చేశారు. అంటే... రెట్టింపు! లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలకు పైమాటే. తాము అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.3,000కు పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చారు. తీరా సీఎం అయ్యాక రూ.2,250కు పెంచుతూ.. ‘250’ చొప్పున పెంచుతామని మెలిక పెట్టారు.


ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో పింఛన్‌ను రూ.2,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. జనవరి 1న కోట్లు ఖర్చు పెట్టి మరీ అబద్ధాలతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వం దిగిపోవడానికి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య 39 లక్షలు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్‌ కేవలం రూ.1000 ’’ అని పెద్ద అక్షరాల్లో అబద్ధాలు ప్రకటించుకున్నారు. అదే రోజున... గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.  ‘‘మా ప్రభుత్వం వచ్చే దాకా రూ.1000 పెన్షన్‌ మాత్రమే ఇచ్చేవారు. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి మాత్రమే రూ.2 వేలు ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మూడు నెలల ముందు వరకు 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారు’’ అని సభలో జగన్‌ చెప్పారు. అంటే... ఒకేరోజున ప్రభుత్వం పత్రికలకు జారీ చేసిన ప్రకటనలో ఒకరకంగా, ముఖ్యమంత్రి మరోరకంగా చెప్పారు. ఈ వక్రీకరణలపై అప్పుడే సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 


అసెంబ్లీలో తేలిన నిజం 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 10న అధికార పారీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, రోజా తదితరులు పెన్షన్లకు  సంబంధించి ప్రశ్నలు అడిగారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన  సమాధానాలు చూస్తే.... గతంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, ముఖ్యమంత్రి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని అర్థమవుతాయి. ‘‘2018 ఏప్రిల్‌ నుంచి 2018 అక్టోబరు మధ్యకాలంలో ప్రతి నెలా 46,88,604 పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో 42,66,729 మందికి  పంపిణీ చేశారు. అదేవిధంగా 2018 నవంబరు నుంచి 2019 మార్చి వరకు టీడీపీ ప్రభుత్వం చివర్లో 53,87,513 పెన్షన్లు మంజూరు చేసింది. వారిలో 51,66,732 మందికి పంపిణీ చేసింది’’ అని గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. వెరసి... చంద్రబాబు హయాంలో 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని తాము అబద్ధం చెప్పినట్లు అంగీకరించినట్లయింది.


టీడీపీ హయాంలో పింఛన్లు ఇలా.. 

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వంలో వృద్ధులు, వితంతువులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 పెన్షన్‌గా ఇచ్చేవారు. సుమారు 39 లక్షల మందికి పంపిణీ చేసేవారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ల పెంపుపై చేశారు. వృద్ధాప్య, వితంతువుల పెన్షన్లు రూ.1000కు, దివ్యాంగులకు రూ.1500కు పెంచారు. అంచెలంచెలుగా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచారు.  2019లో మరింత పెంచారు. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేతలు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, ఏఆర్‌టీ పేషంట్లు,  80 శాతం లోపు వైకల్యం ఉన్నవారికి  రూ.1000 నుంచి రూ.2వేలకు పెంచారు. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.1500 నుంచి రూ.3వేలకు పెంచారు. కిడ్నీ పేషెంట్లకు రూ.2500 నుంచి రూ.3వేలకు పెంచారు. డప్పు కళాకారులకు రూ.3 వేలు, చర్మకారులకు రూ.2 వేలు పంపిణీ చేశారు. అంతేగాక  వయోపరిమితి విషయంలో కూడా పలు వర్గాలకు మినహాయింపులు ఇచ్చారు. 2019 జనవరి నుంచి రూ.2 వేలు, రూ.3 వేలు చొప్పున పెన్షన్లు అమల్లో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే వరకూ పంపిణీ చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా వైసీపీ సర్కారు తప్పుడు ప్రచారం చేసింది.

Updated Date - 2022-03-18T07:42:24+05:30 IST