‘ఎలక్టోరల్‌’ అధికారుల బదిలీపై నిషేధం

ABN , First Publish Date - 2022-08-31T08:49:38+05:30 IST

ఫొటో ఎలక్టోరల్‌ రోల్స్‌ రివిజన్‌ ప్రక్రియ కొనసాగుతున్నందున కీలక అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్రం ఎన్నికల సంఘం నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

‘ఎలక్టోరల్‌’ అధికారుల బదిలీపై నిషేధం

ఓటర్ల జాబితా రివిజన్‌ ప్రక్రియే కారణం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 


అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఫొటో ఎలక్టోరల్‌ రోల్స్‌ రివిజన్‌ ప్రక్రియ కొనసాగుతున్నందున కీలక అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్రం ఎన్నికల సంఘం నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. అదే సమయంలో ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం ఫొటో ఎలక్టోరల్‌ రోల్స్‌ రివిజన్‌ కోసం వచ్చే ఏడాదికి సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబరులో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. వచ్చే జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. రోల్‌ రివిజన్‌ పనిలో నిమగ్నమైన అధికారులను బదిలీ చేస్తే ఈ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు, రివిజన్‌ ఓటర్ల జాబితాల అమలుకు సంబంధించిన అధికారులను బదిలీ చేయరాదు. ఈఆర్‌వో, డీఈవో వంటి అధికారుల బదిలీ తప్పనిసరి అయితే కమిషన్‌ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలి. ఈఆర్‌వో, బీఎల్‌వో సహా దిగువస్థాయి అధికారుల బదిలీ వ్యవహారాన్ని సీఈవో స్థాయిలో నిర్ణయించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్టోరల్‌ రివిజన్‌ ప్రక్రియలో భాగస్వామ్యమున్న జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు నవంబరు నుంచి జనవరి వరకు అనుమతి లేకుండా వారు పనిచేస్తున్న ప్రాంతం నుంచి కూడా మార్చకూడదని ఆదేశించింది. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖల్లోని రివిజన్‌ ఎలక్టోరల్‌ రోల్‌కు సంబంధించిన అధికారుల పోస్టులను అక్టోబరు 31నాటికి భర్తీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది’’ అని మీనా పేర్కొన్నారు. 

Read more