ఇలాగైతే దెబ్బ తింటారు.. జాగ్రత్త

ABN , First Publish Date - 2022-10-01T09:06:24+05:30 IST

‘జిల్లాలో అనేక సమస్యలున్నాయి. కొత్తవి వస్తున్నాయి. మీరందరూ కలిసి ఉమ్మడిగా ఒక్కదానిపై అయినా పోరాటం చేశారా? కలిసికట్టుగా మీ బలం ప్రదర్శించారా? వెనుకబడిపోతున్నారు. ఇలాగైతే కష్టం. దెబ్బ తింటారు జాగ్రత్త’ అని టీడీపీ..

ఇలాగైతే దెబ్బ తింటారు.. జాగ్రత్త

జనంలో ఉండకపోతే నష్టపోతాం

సీనియర్లు పనిచేయకపోతే కొత్తవారికి అవకాశం

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు చంద్రబాబు క్లాస్‌

సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని హితవు


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో అనేక సమస్యలున్నాయి. కొత్తవి వస్తున్నాయి. మీరందరూ కలిసి ఉమ్మడిగా ఒక్కదానిపై అయినా పోరాటం చేశారా? కలిసికట్టుగా మీ బలం ప్రదర్శించారా? వెనుకబడిపోతున్నారు. ఇలాగైతే కష్టం. దెబ్బ తింటారు జాగ్రత్త’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు. శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో  సమావేశం నిర్వహించారు. నాయకుల పనితీరుపై ఈ సమావేశంలో ఆయన ఒకింత కఠినంగానే మాట్లాడినట్లు సమాచారం. పార్టీకి గట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో నేతల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అధికార పార్టీ వైఫల్యాలపై బలంగా పోరాడుతున్న వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.


‘సీఐడీ కార్యాలయం, సీఐడీ కోర్టు గుంటూరులోనే ఉన్నాయి. మన వాళ్లకు ఎవరికి ఇబ్బంది వచ్చినా మీరంతా ఉమ్మడిగా కదిలి నిలబడాలి. ఎవరికి వారుగా ఎవరి నియోజకవర్గాల్లో వారు పనిచేసుకుంటూ ఉంటే ఎలా? పల్నాడులో ఇప్పటికీ పార్టీ క్యాడర్‌పై దాడులు జరుగుతున్నాయి. అరాచకం పెరిగిపోతోంది. మీరంతా వెళ్లి అక్కడ నిలబడితే క్యాడర్‌కు ఎంత ఊరటగా ఉంటుంది? ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి. వాటిని ప్రజల్లో ఎండగట్టాలి. పథకాల ప్రచారం తప్ప అనేక మందికి అవి అందడం లేదు. ప్రతి పథకంలో కోతలు విపరీతంగా ఉంటున్నాయి. ధరలు, పన్నులు పెరిగిపోయి సామాన్యుడు నలిగిపోతున్నాడు. పేదవాడికి ఆదాయం పెరిగే మార్గాలు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. చిన్న చిన్న పనులు కూడా ప్రభుత్వపరంగా చేయలేకపోతున్నారు. ఇటువంటి ప్రతి అంశంలోనూ మీరు ప్రజల్లో ఉండి పనిచేయాలి. చేయలేకపోతే వెనకబడిపోతారు. చేయగలిగినవారు ముందుకు వస్తారు. ఆపై మీ ఇష్టం’ అని ఆయన వారితో అన్నారు. గుంటూరు జిల్లాలో అందరూ పెద్ద నాయకులైపోయారని, సీనియారిటీ పెరిగిపోయి పని తగ్గిపోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా కొందరు ఇన్‌చార్జులు ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని, జనంలో లేకపోతే నష్టపోతామని గుర్తించాలని హెచ్చరించారు.


పోలీసులు అతిచేస్తే ప్రైవేటు కేసులు పెట్టండి

జిల్లాలో గతంలో టీడీపీ హయాంలో పనులు మొదలై తర్వాత ఆగిపోయిన పనులు, ముఖ్యమైన సమస్యలను ఆయన ఈ సమావేశంలో చదివి వినిపించారు. పోలీసులు ఎక్కడైనా అతి చేసి పార్టీ కార్యకర్తలను కొడితే గట్టిగా స్పందించాలని, కొట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో గుంటూరు జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో కార్యాచరణ కార్యక్రమం రూపొందించుకొంటామని, టీం వర్క్‌తో కలిసి పనిచేస్తామని ఆయనకు వారు చెప్పారు. ఈ సమావేశానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ హాజరుకాలేదు. తన అత్తగారు ఘట్టమనేని ఇందిరా దేవి రెండు రోజుల క్రితం మరణించడంతో ఆయన రాలేకపోయారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Read more