‘సీజీఎఫ్‌’ ఇష్టారాజ్యం!

ABN , First Publish Date - 2022-09-08T09:28:47+05:30 IST

‘సీజీఎఫ్‌’ ఇష్టారాజ్యం!

‘సీజీఎఫ్‌’ ఇష్టారాజ్యం!

దేవదాయ శాఖలో కోట్ల రూపాయల కామన్‌ గుడ్‌ ఫండ్‌ దుర్వినియోగం

ఆలయాల జీర్ణోద్ధరణ పనులు గాలికి

కర్నూలు డీసీ ఆఫీ్‌సకు కోటి కేటాయింపు

అనంత, నెల్లూరు, కడప, చిత్తూరు ఆఫీసులకు 50 లక్షల చొప్పున కేటాయింపు

నిబంధనలు ఉన్నా పట్టించుకోని అధికారులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని పలు ఆలయాల నుంచి దేవదాయ శాఖ వసూలు చేసే కామన్‌ గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌) దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోగా.. ఈ నిధుల వినియోగంపై నిర్దేశిత లక్ష్యాన్ని గాలికి వదిలేశారు. వాస్తవానికి సీజీఎఫ్‌ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు వినియోగించాల్సి ఉంది. అదేవిధంగా.. ఆయా ఆలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సి ఉంది. కానీ, సీజీఎఫ్‌ నిధులను ఈ పనులకు కాకుండా.. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, వాటి నిర్మాణాలకు రూ.లక్షల్లో వెచ్చిస్తుండడం వివాదానికి దారితీస్తోంది. చిన్న పనికైనా.. పెద్ద పనికైనా సీజీఎఫ్‌ నిధులనే వాడేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఈ నిధులను ఖాళీ చేసేశారు. పోనీ.. ఆ నిధులతో ఏమైనా భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారా? అంటే అదేమీ లేదు. కేవలం.. అధికారులు తమ కార్యాలయాల అవసరాల కోసం వినియోగించుకున్నారు. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోవడంతో ఇప్పుడు బకాయిలు పేరుతో ఆలయాల నుంచి మళ్లీ సీజీఎఫ్‌ ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. 


పక్కా ప్రణాళిక ఉన్నా..

రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు వచ్చే ఆదాయం నుంచి సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌, ఏడబ్ల్యుఎఫ్‌, ఆడిట్‌ ఫీజుల రూపంలో 21.5 శాతం వరకు వసూలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో వెల్ఫేర్‌ ఫండ్‌ రూపంలో కొన్ని కోట్ల రూపాయిలను వసూలు చేశారు. దేవాలయాల నుంచి వసూలు చేసే ఈ ఫండ్స్‌ను వివిధ రూపాల్లో ఖర్చు చేయాల్సి ఉంది. ముఖ్యంగా కామన్‌ గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌) కింద ఆలయాల నుంచి వసూలు చేసే 9ు నిధులను.. ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు వినియోగించాలి. అదేవిధంగా ఆదాయం లేని ఆలయాలకు ఈ నిధులు కేటాయించి పూర్వవైభవం తీసుకురావాలి. ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ కింద వసూలు చేసే 8ు నిధులను ఉద్యోగుల జీతాల కోసం ఉపయోగిస్తారు. అర్చక సంక్షేమ నిధి కింద వసూలు చేసే 3 శాతం నిధులను అర్చకులకు రుణాలు, వారి ఇతర అవసరాల కోసం ఉపయోగించాల్సి ఉంది. ఇలా.. దేనికి దారిని.. ఒకనిర్దిష్టమైన ప్రణాళిక, విధానం ఉన్నాయి. అయినప్పటికీ.. సీజీఎఫ్‌ నిధుల విషయంలో మాత్రం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయాల జీర్ణోద్ధరణకు వినియోగించాల్సిన ఈ సొమ్మును.. జిల్లాల విభజన సమయంలో కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో ఫర్నిచర్‌ కొనుగోలుకు వినియోగించారు. దీని వెనుక దేవదాయ శాఖలోని ‘జాదు’ అధికారి హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి సీజీఎఫ్‌ నిబంధనలను తుంగలోతొక్కి పరిమితికి మించి కొన్ని ఆలయాలకు రూ.కోట్ల నిధులు కేటాయించారు. దీంతో సీజీఎఫ్‌ ఖాతా మొత్తం ఖాళీ అయింది. 


కార్ల కొనుగోలూ ఆలయాల అభివృద్ధేనా?

ఇప్పుడు మళ్లీ దేవాలయాల నుంచి రూ.కోట్ల నిధులను సీజీఎఫ్‌ కింద వసూలు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడైనా వాటిని నిబంధనల మేరకు ఖర్చు చేస్తున్నారా? అంటే.. అదిలేదు. గతంలో మాదిరిగానే ఇష్టారాజ్యాంగా వినియోగించేందుకు సిద్ధమయ్యారని ఉద్యోగుల మధ్య చర్చ నడుస్తోంది. దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 70 ప్రకారం సీజీఎఫ్‌ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు మాత్రమే వినియోగించాలి. కానీ, శాఖలో ఏ చిన్న పని చేయాలన్నా వీటినే వాడేస్తుండడం వివాదంగా మారుతోంది. చివరికి ఉన్నతాధికారులు ఉపయోగించే కార్లు కూడా కొనుగోలు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో సీజీఎఫ్‌ నిధులతో దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రూ.10 లక్షలతో గోశాలను నిర్మించారు. రూ.50 లక్షలతో అనంతపురం అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులకు శంకుస్థాపన చేశారు. కర్నూలులో రూ.కోటి నిధులతో డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఏసీ కార్యాలయాల నిర్మాణానికి ఒక్కొక్క దానికి దాదాపు రూ.50 లక్షల చొప్పున కేటాయించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్ల కార్యాలయాలు కూడా దేవాలయాల అభివృద్ధి కిందకే వస్తాయని వారికి వారే సర్దిచెప్పుకొంటుండడం గమనార్హం.


కమిటీ ఏం చేస్తున్నట్టు?

సాధారణంగా సీజీఎఫ్‌ నిధులు ఎవరికి కేటాయించాలి. ఎంత మొత్తంలో కేటాయించాలన్న విషయం చట్టంలో స్పష్టంగా ఉంది. దానికి అనుగుణంగా సీజీఎఫ్‌ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, ఈ కమిటీ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సీజీఎఫ్‌ కమిటీని ప్రభుత్వమే నియమించింది. దీనిలో దేవదాయశాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌లు ఉన్నారు. ఈ కమిటీ భేటీకి ముందుకు యాక్ట్‌ అనుగుణంగా అజెండా తయారు చేస్తారు. దాని ప్రకారమే నిధులు వినియోగించాలని నిర్ణయిస్తారు. కానీ, కమిటీ భేటీ అనంతరం అజెండా మొత్తం మారిపోతోందనే వాదన ఉంది. ఇదిలావుంటే, తాజాగా సీజీఎఫ్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కొత్త సీజీఎఫ్‌ కమిటీ అయినా.. అజెండా ప్రకారం నిధులను వినియోగిస్తుందో లేదో చూడాలని ఉద్యోగులు అంటున్నారు.

Read more