కేంద్రం డబ్బు.. జగన్‌ డబ్బా

ABN , First Publish Date - 2022-08-15T08:05:12+05:30 IST

కేంద్రం డబ్బు.. జగన్‌ డబ్బా

కేంద్రం డబ్బు.. జగన్‌ డబ్బా

పేదల ఇళ్లకు రాయితీ సొమ్మంతా కేంద్రానిదే 

రాష్ట్ర ప్రభుత్వం వాటా 5 శాతం మాత్రమే 

తొలివిడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు 

ఒక్కో ఇంటికి 1.80 లక్షల రాయితీ 

కేంద్రం సాయం 1.50 లక్షలు.. రాష్ట్రం 30 వేలు

10.10 లక్షల ఇళ్లకు పూర్తిగా కేంద్రం నిధులు 

మొత్తం ప్రాజెక్టు వ్యయం 28,084 కోట్లు 

రాష్ట్రంపై ఆర్థిక భారం కేవలం 1,650 కోట్లు 

ఆ నిధులనూ సక్రమంగా ఇవ్వలేని వైనం 

రెండేళ్లలో పూర్తయిన ఇళ్లు 5 శాతమే 


నిధులు కేంద్రానివి. పేరు, ప్రచార ఆర్భాటం మాత్రం వైసీపీ సర్కారుది. జగనన్న ఇళ్ల పథకం అమలు తీరు ‘సొమ్మొకడిది.. సోకొకడిది’ అన్న చందాన్ని తలపిస్తోంది. తొలి విడతలో మంజూరైన 15.60 లక్షల ఇళ్లలో 10.10 లక్షల ఇళ్లకు రాయితీ నిధులు పూర్తిగా కేంద్రానివే. మిగిలిన ఇళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాలి. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం నిధులు మాత్రమే ఇవ్వాలి. వాటినీ సరిగా విడుదల చేయలేని పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్టుగా ప్రభుత్వ పెద్దలు బిల్డప్‌ ఇస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘‘ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. వారి పేరునే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌. అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం’’.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా జగనన్న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ‘ఇళ్లు మీరు కట్టుకుంటే డబ్బులిస్తాం.. లేదంటే మేమే కట్టిస్తాం’ అంటూ బహిరంగ సభల్లో లబ్ధిదారులనుద్దేశించి సీఎం జగన్‌ ఊదరగొట్టారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి జగన్‌ చెప్పేవన్నీ సొల్లు కబుర్లేనని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 30.66 లక్షల మంది పేదలకు రూ.55,188 కోట్లతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2020లో తొలివిడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడాది వ్యవధిలో వీటి నిర్మాణాన్ని పూర్తి చేసి, 2021లోగా రెండో విడతలో మిగిలిన దాదాపు 15.06 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్టుగా పాలకులు బిల్డప్‌ ఇస్తున్నారు. వాస్తవమేమిటంటే రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో దాదాపు 95 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం 5 శాతం మాత్రమే. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు’గా పేదల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే.. ఆ క్రెడిట్‌ మొత్తాన్ని జగన్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది. 


కేంద్రం, రాష్ట్రం వాటాలు ఇవీ.. 

పేదల ఇళ్లకు ఒక్కొక్క దానికి ఇస్తున్న రాయితీ మొత్తం రూ.1,80,000. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,50,000. మిగిలిన రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా లబ్ధిదారులకు చెల్లించాలి. ఈ లెక్కన తొలివిడతలో చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.4,680 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.  పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన నిధులను ఇళ్ల లబ్ధిదారులకు లేబర్‌ చార్జీలుగా చెల్లిస్తూ రూ.3,030 కోట్ల భారాన్ని దించేసుకుంది. తొలిదశలో చేపట్టిన ఇళ్లలో అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (యూడీఏ)ల పరిధిలో ఉన్న 10.10 లక్షల మంది లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలకు రూ.30 వేలు చొప్పున ఉపాధి హామీ నిధులనే చెల్లిస్తోంది. అంటే రాష్ట్రంలో తొలిదశలో చేపట్టిన 15.6 లక్షల ఇళ్లలో 10.10 లక్షల ఇళ్లకు కేంద్ర సాయం (రూ.1,50,000)తో పాటు రాష్ట్రం వాటా (రూ.30 వేలు) కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నవే. ఇక అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (యూఎల్‌బీ) పరిధిలో నిర్మిస్తున్న 5.5 లక్షల ఇళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.30 వేలు చొప్పున రూ.1,650 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. తొలిదశలో చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవుతున్న మొత్తం రూ.28,084 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో జగన్‌ ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం రూ.1,650 కోట్లు (5.87 శాతం) మాత్రమే. ఈ నిధులను కూడా సక్రమంగా విడుదల చేయడం లేదు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో జగనన్న ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.


రెండేళ్లలో 5 శాతం ఇళ్లే పూర్తి 

జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ప్రారంభించి రెండేళ్లు గడిచిపోయింది.   తొలివిడతలో చేపట్టిన 15.60 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు 60,783 ఇళ్లు (5 శాతం) మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవాటిలో 8 లక్షలకు పైగా ఇళ్లు బిలో బేస్‌మెంట్‌ లెవెల్లో, మరో 2 లక్షలకు పైగా ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్లో ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలు కలిపి 10 లక్షలకు పైగా ఇళ్లు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. మరో 58 వేల ఇళ్లు గోడల వరకు (రూఫ్‌ లెవెల్‌) పూర్తికాగా.. మరో 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. తొలిదశ ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. రెండో దశలో చేపట్టిన మరో 15 లక్షలకు పైగా ఇళ్లు ఎప్పటికి పూర్తి చేస్తారనేది పాలకులే చెప్పాలి. 

Updated Date - 2022-08-15T08:05:12+05:30 IST