ధిక్కార కేసులపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-08-31T09:29:59+05:30 IST

హైకోర్టు ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం అత్యంత ముఖ్యమైన పనిగా భావించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర సర్కారు దిశానిర్దేశం చేసింది. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే అప్పీలు చేయాలని స్పష్టం చేసింది. ఇకపై కోర్టు ధిక్కార చర్యలు

ధిక్కార కేసులపై నిర్లక్ష్యం వద్దు

హైకోర్టు ఆదేశాలపై తక్షణ చర్యలు.. అతి ముఖ్యమైనదిగా భావించండి

అమలు... లేదంటే అప్పీల్‌

కేసులపై ప్రతి మంగళవారం సమీక్ష 

ధిక్కార చర్యలు వస్తే బాధ్యులపై చర్యలు: సీసీఎల్‌ఏ


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

హైకోర్టు ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం అత్యంత ముఖ్యమైన పనిగా భావించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర సర్కారు దిశానిర్దేశం చేసింది. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే అప్పీలు చేయాలని స్పష్టం చేసింది. ఇకపై కోర్టు ధిక్కార చర్యలు వస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్‌ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల అమలు, కేసుల పెండింగ్‌ వంటి అంశాలపై డేటా నిర్వహణకు ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేసెస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఏపీఓఎల్‌సీఎంఎ్‌స)ను ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.


అందులో శాఖలు, విభాగాల వారీగా హైకోర్టులో ఉన్న కేసులు, కోర్టు ఇచ్చిన తీర్పులు, వాటిపై అప్పీళ్లు, వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలి. జిల్లాల వారీగా ఈ డేటాను కలెక్టర్‌లు దగ్గరుండి చూసుకోవాలి. అయితే కొన్నేళ్లుగా ఈ విధానం సరిగ్గా అమలు కావడం లేదు. వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, విభాగాధిపతులు పలు అంశాల్లో హైకోర్టు తీర్పులు అమలు చేయనందుకు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 


సీసీఎల్‌ఏ జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైన అంశాలివీ.. 

  • హైకోర్టు ఇచ్చే ఆదేశాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సమాచారాన్ని ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేసెస్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. కోర్టు ధిక్కార కేసులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ఎలాంటి చర్య తీసుకున్నారు, ప్రభుత్వ ప్లీడర్‌ ఇచ్చిన సూచనల మేరకు ఏం చేశారో డేటా సిస్టమ్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ డేటాను ప్రభుత్వ ప్లీడర్లు ఉపయోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలి. 2019 జనవరి 1 తర్వాత వచ్చిన ప్రతీ కోర్టుధిక్కార కేసును కలెక్టర్‌ పరిశీలించి డేటా అప్‌లోడ్‌ చేయాలి. 
  • హైకోర్టులో ఏదైనా అంశంపై విచారణ జరిగి ప్రాథమిక స్థాయిలో ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత దానిపై ఏం చేస్తున్నారో స్పష్టంగా ఆ డేటాబే్‌సలో ప్రస్తావించాలి. పెండింగ్‌ అప్లికేషన్‌పై హైకోర్టు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన ఆదేశాలు ఇస్తే తక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమయితే పిటిషనర్ల సమ్మతితో వారిని పిలిపించి, వ్యక్తిగతంగా వారి వాదనలు వినాలి. 
  • హైకోర్టు ఆదేశాలకు సంబంధించి ప్రతి కేసులో సర్టిఫైడ్‌ జడ్జిమెంట్‌ కాపీని తెప్పించుకొని పరిశీలన చేయాలి. 
  • వివిధ అంశాలపై ఇచ్చే హైకోర్టు తాజా, మధ్యంతర ఉత్తర్వులపై కలెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యంతర ఉత్తర్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే 10 రోజుల్లో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేసి వారం రోజుల్లోగా స్టే వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేయించేలా చర్యలు చేపట్టాలి. అప్పీల్‌కు అవకాశం లేని మధ్యంతర ఉత్తర్వులను నిర్దేశించిన కాలవ్యవధిలో అమలు చేయాల్సిందే. 
  • వివిధ కేసుల్లో జీపీలు పంపించే పేరా వైజ్‌ రిమార్కులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టి ఆయా కేసుల్లో జీపీలు కౌంటర్‌ దాఖలు చేసేందుకు అవసరమైన డేటాను అప్‌లోడ్‌ చేయాలి. 
  • హైకోర్టు ఆదేశాల అమలు, కౌంటర్‌ దాఖలు తదితర అంశాల అధ్యయనం కోసం తహసిల్దార్‌ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఒక్కో కేసులో కోర్టు ఏం ఆదేశించింది? ఇప్పటి వరకు ఏం చేశారు? ఇంకా ఏం చేయాలో నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి.
  • కోర్టు కేసుల అంశాన్ని ఎప్పుడూ ఉండే పనిగా చూడొద్దు. ఉన్న పనుల్లో అత్యంత ముఖ్యమైన పనిగానే దీన్ని పరిగణించాలి. ఇకనుంచి ఈ అంశంపై ప్రతి మంగళవారం ఇద్దరు జాయింట్‌ సెక్రటరీ(లాండ్‌, విజిలెన్స్‌)లు కలెక్టర్లతో చర్చిస్తారు. ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేసేందుకు వాటిని డివిజనల్‌, మండల తహసిల్దార్‌ స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. 

Updated Date - 2022-08-31T09:29:59+05:30 IST