వాహనాలు అప్పగించని డీలర్లపై కేసులు

ABN , First Publish Date - 2022-12-16T01:33:48+05:30 IST

టీడీపీ ప్రభుత్వ హయాంలో వాహనాలు కొనుగోలు చేస్తామని అడ్వాన్స్‌ పొంది, వాహనాలు సరఫరా చేయకుండా, అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వని డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు.

వాహనాలు అప్పగించని డీలర్లపై కేసులు

ఆ కేసులను సీఐడీకి అప్పగిస్తున్నాం: మేరుగ

అమరావతి, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో వాహనాలు కొనుగోలు చేస్తామని అడ్వాన్స్‌ పొంది, వాహనాలు సరఫరా చేయకుండా, అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వని డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సీఐడీతో విచారణ చేయించాలని సూచించారు. తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో గురువారం 11వ కమిటీ ఆఫ్‌ పర్సన్స్‌ (సీఓపీ) సమావేశం జరిగింది. పలు అంశాలపై మంత్రి సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇ-ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్‌ డ్రైన్‌ క్లీనర్లు సరఫరా కోసం టెండర్లు పొంది ప్రభుత్వం నుంచి కొంతమంది డీలర్లు అడ్వాన్సు తీసుకున్నారు. కెనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ పవర్‌ సొల్యూషన్స్‌, వెంకటేశ్వర ట్రేడర్స్‌(తాడేపల్లి), ఈగల్‌ అగ్రి ఎక్వి్‌పమెంట్‌ (కావలి), టాఆర్రన్స్‌ ఆటోమొబైల్స్‌(పెద్ద తాడేపల్లి) సంస్థలకు చెందిన డీలర్ల వద్ద రూ.46 కోట్ల వరకు ఉండిపోయాయి. వాహనాలు సరఫరా చేయడం గాని, తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించడం గానీ చేయలేదు. అధికారులు, మంత్రులు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి డీలర్లు తాడేపల్లి పెద్దలను ఆశ్రయించడంతో మూడేళ్ల పాటు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే పలు కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు అడ్వాన్స్‌ రికవరీ చేసేందుకు మంత్రి సీఐడీని ఆదేశించారు.

Updated Date - 2022-12-16T01:33:49+05:30 IST