కేంద్ర పథకాల కబ్జా

ABN , First Publish Date - 2022-06-12T08:25:42+05:30 IST

కేంద్ర పథకాల కబ్జా

కేంద్ర పథకాల కబ్జా

నిధులు కేంద్రానివి.. ప్రచారం జగన్‌ది

నవరత్నాల్లో అధిక నిధులు కేంద్రానివే

ప్రజలకు నిజాలు చెబుతున్న బీజేపీ

రాష్ట్రానికి కేంద్ర మంత్రుల క్యూ

అప్పులు  తప్ప ఆయన చేసింది శూన్యం!

రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తున్న బీజేపీ శ్రేణులు

కేంద్రమంత్రుల దిశానిర్దేశంతో గడప గడపకు కార్యకర్తలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నవరత్నాలే తన అజెండా అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారా? మద్యం ఆదాయంతోపాటు కేంద్రం ఇస్తున్న నిధులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? ఇవి రెండూ సరిపోక.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్నారా? నిజమనే అంటున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్ర ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వంచిస్తోందో గడప గడపకూ వెళ్లి వివరించేందుకు బీజేపీ నడుం బిగించింది. మోదీ ప్రభుత్వం ఆంధ్రులకు ఇస్తున్నది ఏమిటో? తక్కువ వాటా ఇచ్చి జగన్‌ ఎంతగా ప్రచారం చేసుకొంటున్నారో వివరించబోతోంది. ఇందుకోసమే కేంద్ర మంత్రులు, ఆ పార్టీ జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి రాష్ట్రంలో మాత్రం నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయి.  గతంలో టీడీపీతో, ఇప్పుడు జనసేనతో పొత్తు మినహా సొంతంగా పోటీచేసే సత్తా ఒక్క నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి కనిపించడంలేదు. కారణాలను విశ్లేషించుకున్న బీజేపీ అగ్రనేతలు ఏపీలో బలం పెరగకపోవడానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు, దుగరాజపట్నం పోర్టు, రెవెన్యూలోటు, పోలవరానికి నిధులు, కడప స్టీల్‌ ప్లాంటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర విషయాలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారమే కారణమని గుర్తించారు. వాటిని పక్కన పెడితే రైతులకు కిసాన్‌ సమ్మాన్‌, పేదలకు ఆయుష్మాన్‌ భారత్‌, విద్యార్థులకు 11 ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పేదలకు రేషన్‌ బియ్యం సబ్సిడీ, అంత్యోదయ, గ్రామాలకు తాగునీరిచ్చే అమృత్‌, పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్‌ సిటీ, పేదలకు పక్కా ఇళ్ల కోసం పీఎంఏవై తదితర పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉందనే విషయమై బీజేపీ కసరత్తు చేసింది. వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను కబ్జా చేసిందని, పేదలకు కేంద్రం నిధులిస్తోంటే, జగన్‌ సొంత మీడియాకు కోట్లాది రూపాయల ప్రకటనలిచ్చి మొత్తం క్రెడిట్‌ను తన ఖాతాలోకి వేసుకుంటున్నట్టు పసిగట్టింది. ఈ నిజాలను ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు. 


పథకాలపై నిలదీస్తున్న కేంద్ర మంత్రులు..

గత నెలలో ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విజయనగరంలో జిల్లా అధికారులతో సమీక్షించి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేంటో వివరించారు. ఈ పథకంలో కేంద్రం వాటా 60శాతం ఉందా లేదా? ఆ పథకంలో యాభై శాతం, మరో పథకంలో 75శాతం, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిలో 90శాతం వరకూ కేంద్రం నిధులు వస్తున్నాయా? లేదా? అంటూ రాష్ట్ర అధికారులను నిలదీశారు. ఇదే విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని అనంతరం బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇదే విషయాన్ని విజయవాడలో వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ ఆరోగ్య శ్రీలో మోదీ ఫొటో ఎందుకు లేదంటూ రాష్ట్ర అధికారులను నిలదీశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకోడానికి ప్రధాని మోదీ జూలై 4న  భీమవరం రానున్నారు. ఆ ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం రాష్ర్టానికి రానున్నారు. మరో కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ కూడా త్వరలో రాష్ర్టానికి వస్తున్నారు.


గడప గడపకు ఐవైఆర్‌ పుస్తకం..

రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, బీజేపీ నేత సుధీష్‌ రాంభొట్ల రచించిన ‘కేంద్రం సహకారం.. రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం’ పుస్తకాన్ని కూడా బీజేపీ కార్యకర్తలకు అందించి ప్రజల్లోకి పంపుతోంది. ఎన్నికల ముందు జగన్‌ను నమ్మి 151 సీట్లలో గెలిపిస్తే ఆంధ్రులకు చేసిన ద్రోహమేంటి? నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి పేదల రక్తాన్ని పీల్చేస్తున్న వైనం కూడా వివరిస్తోంది.


ఏ పథకంలో ఎలా మోసం..?

ఇక రైతు భరోసా కింద జగన్‌ ఇస్తున్న నిధుల్లో సగం కేంద్రానివేనని, దేశంలోని రైతులకు మోదీ ప్రభుత్వం ఏటా ఎకరానికి ఆరువేల చొప్పున ఇస్తున్న నిధులు తనవిగా జగన్‌ ప్రచారం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు వివరిస్తున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్రానికి చెందిన ఉపాధి నిధులు 90శాతం ఖర్చు చేసి రైతు భరోసా కేంద్రాలను నిర్మించిన జగన్‌ ప్రభుత్వం ఎక్కడా మోదీ పేరు వాడలేదని వివరిస్తున్నారు. జగనన్న కాలనీలు అంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకొంటున్న పేదల పక్కా గృహాలకు 80శాతం కేంద్ర నిధులే ఇస్తున్న విషయాన్ని కూడా బీజేపీ నేతలు వివరిస్తున్నారు. పేదలకు సెంటు స్థలంలో జగన్‌ ప్రభుత్వం నిర్మించి ఇస్తోన్న ఇంటికి రూ.1.80లక్షలు ఖర్చు చేస్తుంటే, అందులో లక్షన్నర కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) నుంచి ఇస్తున్నవే. ఇప్పటి వరకూ రాష్ట్రానికి కేంద్రం పాతిక లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెబుతున్నారు. విద్యుత్‌ సంస్కరణలు మొదలుకొని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పదకొండు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వరకూ కేంద్రం ఇచ్చినవేనని బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడెప్పుడు ఎన్ని నిధులను కేంద్రం ఇచ్చిం ది? జాప్యానికి వైసీపీ సర్కారు లెక్కలు చెప్పక పోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. 

Updated Date - 2022-06-12T08:25:42+05:30 IST