సంకల్పమే యాత్రాబలమై..

ABN , First Publish Date - 2022-09-21T09:15:14+05:30 IST

ఒకవైపు భగ్గుమంటున్న కృష్ణా ఎండలు..మరోవైపు సుదీర్ఘ యాత్రతో పుండ్లు పడి మండుతున్న పాదాలు.. అయినా, అమరావతి రాజధాని సాధన కోసం అన్నదాతలు సంకల్పబలంతో అడుగు ముందుకే వేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి

సంకల్పమే యాత్రాబలమై..

మండే ఎండలనూ లెక్కచేయకుండా నడక

కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన రాజధాని రథం

పులిగడ్డ-పెనుమూడి వారధిపై జనసంద్రం

పూలుచల్లి దివిసీమలోకి రైతులకు ఘన స్వాగతం

రేపల్లె-చల్లపల్లి వరకు 17 కిలోమీటర్ల యాత్ర

ముందుకొచ్చి లక్ష విరాళం ఇచ్చిన మహిళలు 


 బాపట్ల, మచిలీపట్నం (ఆంధ్రజ్యోతి) అవనిగడ్డ/మోపిదేవి/చల్లపల్లి సెప్టెంబరు 20 : ఒకవైపు భగ్గుమంటున్న కృష్ణా ఎండలు..మరోవైపు సుదీర్ఘ యాత్రతో పుండ్లు పడి మండుతున్న పాదాలు.. అయినా, అమరావతి రాజధాని సాధన కోసం అన్నదాతలు సంకల్పబలంతో అడుగు ముందుకే వేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర గుంటూరు, బాపట్ల జిల్లాలను దాటుకుని మంగళవారం కృష్ణాజిల్లా చేరుకుంది. బాపట్లజిల్లా రేపల్లె మసీదు సెంటరులో ఉద యం తొమ్మిది గంటలకు పాదయాత్ర మొదలైంది. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ముందువరుసలో నడుస్తూ మద్దతు తెలిపారు. 10.45 గంటల సమయంలో యాత్ర పెనుమూడి వారధి వద్ద కృష్ణాజిల్లాలోకి అడుగుపెట్టింది. వారధి కింద కృష్ణమ్మ పరవళ్లతో ఉరకలెత్తుతుండగా, వారధిపై అమరావతి రాజధాని మహాపాదయాత్రకు మద్దతు పలికేందుకు జనం పోటెత్తారు. దీంతో 3.2 కిలోమీటర్ల మేర వారధి జనంతో కిక్కిరిసిపోయిం ది.


ఒకవైపు డప్పులహోరు, మరోవైపు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు, సీఎం డౌన్‌డౌన్‌ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. వారధి మీద ట్రాఫిక్‌ నియంత్రించేవారే కరువవడంతో దాదాపు అరగంటసేపు అటు వాహనదారులు ఇటు పాదయాత్రికులు, సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. కాగా, వారధికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై నిలబడి అడుగడుగునా పూలుచల్లి...మోపిదేవి వార్పు వద్ద యాత్రకు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నానికి మోపిదేవికి చేరుకుని.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు చేశారు. అక్కడినుంచి జాతీయ రహదారి 216 మీదుగా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రం వద్దకు సాయంత్రానికి పాదయాత్రికులు చేరుకున్నారు. వారికోసం అక్కడ రాత్రి బస ఏర్పాటుచేశారు. మంగళవారం 17 కిలోమీటర్లమేర పాదయాత్ర సాగింది. కాగా, మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామ మహిళలు మహాపాదయాత్రకు లక్ష రూపాయలు, తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామస్థులు రూ.55వేలు విరాళంగా అందజేశారు.


తలవంచక తప్పదు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విఽధ్వంస రాజకీయ నాయకుడని, విధ్వంసం ఆయన నైజమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌  అన్నారు. ఆయన మోపిదేవిలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే కోర్టులు వైసీపీ ప్రభుత్వానికి 200 కేసుల్లో మొట్టికాయలు వేసిందని కనకమేడల మండిపడ్డారు. రాజధాని ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం తలవంచాల్సిందేనని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నపుడు వైఎస్‌ జగన్‌.. రాజధాని నిర్మాణం కోసం 30 వేల ఎకరాలు విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్య కావాలని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ రాజధాని నిర్మాణం చేయలేక, చేతగాక, మూడు రాజధానుల అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. పాదయాత్రలో రైతులతో కలిసి పలుపార్టీల నేతలు అడుగులువేశారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ దంపతులు, సీపీఐ నాయకులు అక్కినేని వనజ, నార్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రైతులతో నడిచారు.

Updated Date - 2022-09-21T09:15:14+05:30 IST