మెడికల్‌ కాలేజీలపై చేతులెత్తేశారు!

ABN , First Publish Date - 2022-07-25T09:13:03+05:30 IST

16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించింది. 2023 నాటికి పూర్తి చేస్తామని ఊదరగొట్టింది.

మెడికల్‌ కాలేజీలపై చేతులెత్తేశారు!

వచ్చే ఏడాదికి కొత్త వాటి నిర్మాణం కష్టమే

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల నుంచే కసరత్తు 

టెండర్లతో హడావుడి.. నిధులు కేటాయించని వైనం 

3 కాలేజీలకు కేంద్రం, మూడింటికి నాబార్డు సాయం

ఆ 6 పూర్తి కావాలన్నా రాష్ట్రం 949 కోట్లు ఇవ్వాలి

అగమ్యగోచరంగా మరో 10 కాలేజీల నిర్మాణం

తక్షణం 4,855 కోట్లు ఇస్తేనే పనులు ముందుకు 

రెండేళ్లుగా బ్యాంకర్లతో అధికారుల సమావేశాలు

రుణాలిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా 

ఇక కేంద్రంపైనే ఆరోగ్య శాఖ ఆశలు

గట్టిగా ప్రయత్నిస్తే 2027 తర్వాతే పూర్తి


16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించింది. 2023 నాటికి పూర్తి చేస్తామని ఊదరగొట్టింది. 16 మెడికల్‌ కాలేజీలు ఇచ్చేశామని ఇటీవల సీఎం జగన్‌ పలుమార్లు  చెప్పారు. అయితే టెండర్ల ప్రక్రియ వరకూ హడావుడి చేసిన సర్కారు నిర్మాణానికి నిధులు మాత్రం కేటాయించలేదు. 


అప్పుల కోసం వేట ప్రారంభించి రెండేళ్లయింది. ప్రభుత్వం రుణాలు అడగని బ్యాంకు లేదు. ఎక్కని మెట్లు లేవు. కాలేజీల నిర్మాణానికి కేటాయించిన భూములు, పాత మెడికల్‌ కాలేజీల ఆస్తుల తాకట్టుకు సిద్ధమైంది. ఎంబీబీఎస్‌ సీట్లు అమ్ముతామంది. ఆరోగ్యశ్రీ నిధులు కూడా కోట్లు మళ్లించేసింది. అయినా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ససేమిరా అన్నాయి. 


రుణాలు తేవడానికి ప్రభుత్వం ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. ఆయన ముంబై చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం లేకపోయింది. ఇక రుణాలు తేవడం సాధ్యం కాదని, కేంద్రమే దిక్కన్న స్థితికి సర్కారు వచ్చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఏడాదికి మెడికల్‌ కాలేజీలు పూర్తి చేసే పరిస్థితి లేదు. జగనన్న సర్కారు గొప్పగా ప్రకటించిన కొత్త మెడికల్‌ కాలేజీల కథ ఇది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మూడేళ్లలో కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే కసరత్తు ప్రారంభించారు. డిజైన్లు పూర్తి చేశారు. దాదాపు 13 వేల కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణంతో పాటు 11 పాత కాలేజీల్లో నాడు-నేడు కింద పనులు చేస్తామన్నారు. హడావుడిగా టెండర్లు పిలిచారు. కావల్సిన కంపెనీలకు కట్టబెట్టారు. ఇంతవరకూ ఆగమేఘాల మీద పూర్తి చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పనులు ప్రారంభించాలంటే నిధులు కావాలి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఉన్నది ఒక్కటే ఆప్షన్‌! అప్పులు తేవడం. రెండేళ్ల నుంచి అప్పుల వేట మొదలు పెట్టారు.


జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయించారు. ఒక్క బ్యాంకు కూడా అప్పులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మి వడ్డీతో సహా అప్పులు తీరుస్తామన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు బదలాయిస్తామన్నారు. అయినా బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మలేదు. చివరికి 11 పాత మెడికల్‌ కాలేజీలు, కొత్తగా నిర్మించే 16 కాలేజీల భూములు తాకట్టు పెడతామన్నా బ్యాంకులు అంగీకరించలేదు. ఇంతలో 3 కాలేజీల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పాడేరు, మచిలీపట్నం, పిడిగురాళ్లలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరో మూడు కాలేజీలకు రుణం ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించింది. మిగిలిన 10 కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలుత రుణాల కోసం ఆరోగ్య శాఖ అధికారులు బ్యాంకర్లను తమ కార్యాలయాలకు పిలిపించుకున్నారు. అధికారులు చెప్పిన ప్రతిపాదనలు విన్న బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ అధికారులు బ్యాంకర్ల చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ సమక్షంలో బ్యాంకర్లతో అనేక సార్లు సమావేశాలు జరిగాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. అధికారులు ఇప్పటికీ బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రుణాల కోసం ప్రభుత్వం ఏపీఎంఎ్‌సఐడీసీలో ఒక కీలక  అధికారిని తీసుకువచ్చింది. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు. అనేక సార్లు ముంబై చుట్టూ తిరిగారు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో విసిగిపోయిన ఆయన బ్యాంకు రుణాల విషయం పక్కన పెట్టి సొంత లాభం చూసుకోవడం ప్రారంభించారు. అప్పుడప్పుడు బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నా బ్యాంకర్ల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. చివరికి మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదని, మరో మార్గం చూసుకోవడం మంచిదన్న విషయాన్ని సదరు అధికారికి చెప్పినట్టు తెలుస్తోంది. 


చాలీచాలని నిధులతో నిర్మాణం ఎలా..? 

3 కాలేజీల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించగా, మరో 3 కాలేజీల నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 22న జరిగిన సమావేశంలో 3 కొత్త మెడికల్‌ కాలేజీలు, 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు రూ.1392 కోట్లు ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించింది. నాబార్డు నిధులతో విజయనగరం, రాజమండ్రి, పులివెందుల కాలేజీల నిర్మాణం చేపట్టారు. నాబార్డు నిధుల్లో రూ.246 కోట్లు 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు కేటాయిస్తారు. ఈ లెక్కన రూ.1146 కోట్లతో ఆ మూడు మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాలి. చాలీచాలని నిధులతో నిర్మాణం అసాధ్యమని ఇంజనీర్లు చెబుతున్నారు. విజయనగరం మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు, రాజమండ్రి కాలేజీకి రూ.475 కోట్లు, పులివెందుల కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. మూడు కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ.1475 కోట్లు అవసరం. దీంతో  నాబార్డు మెడికల్‌ కాలేజీలకు కేటాయించిన రూ.1146 కోట్లు ఏ మూలకూ సరిపడే పరిస్థితి లేదు. వీటికి అదనంగా రూ.329 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థాయిలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. 


949 కోట్లు ఇస్తేనే.. ఆ ‘ఆరు’ పూర్తి! 

కేంద్రం నిధులతో మూడు కాలేజీలు, నాబార్డు నిధులతో మరో మూడు కాలేజీలను గట్టేక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై వందల కోట్ల ఆర్థిక భారం పడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన మూడు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం అంటే దాదాపు రూ.620 కోట్లు నిధులు కేటాయించాలి. నాబార్డు కింద నిర్మిస్తున్న మూడు కాలేజీలకు అదనంగా రూ.329 కోట్లు అవసరం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కాలేజీల నిర్మాణం చేపట్టాలంటే రూ.949 కోట్లు అదనంగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో రూ.949 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా..? అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్రం, నాబార్డు నిధులతో ఆరు కాలేజీల నిర్మాణ పనులు కూడా పూర్తిస్థాయిలో ముందుకు సాగే పరిస్థితి లేదు.


ఇక కేంద్రపైనే భారం 

ఎంత తిరిగినా బ్యాంకర్ల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అధికారులు మరో ఆలోచనకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. బ్యాంకర్లను నమ్ముకోవడం కంటే కేంద్రమే దిక్కు అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. మిగిలిన 10 కాలేజీల్లో తొలి విడతలో 5 కాలేజీలకు, మరో విడతలో 5 కాలేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించే యోచనలో అధికారులున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం నిర్దేశించిన 2023 నాటికి కాలేజీలు ప్రారంభించలేమని.. గట్టిగా ప్రయత్నిస్తే 2027 తర్వాతనే కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయగలమన్న సృష్టత అధికారుల్లో వచ్చింది. ఇక ప్రభుత్వానికే సృష్టత రావాల్సి ఉంది.


10 కాలేజీలకు గ్రహణం 

అరకొర నిధులతో 6 కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభించినా... మిగిలిన 10 కాలేజీల పరిస్థితి ఏమిటన్నది ఏపీఎంఎ్‌సఐడీసీకి అర్థం కావడం లేదు. ఏలూరు కాలేజీ నిర్మాణానికి రూ.525 కోట్లు, నంద్యాల కాలేజీకి రూ.475 కోట్లు, అమలాపురం-రూ.475 కోట్లు, బాపట్ల-రూ.505 కోట్లు, మార్కాపురం -రూ.475 కోట్లు, మదనపల్లె-రూ.475 కోట్లు, పెనుకొండ కాలేజీకి రూ.475 కోట్లు, అనకాపల్లి కాలేజీకి రూ.500 కోట్లు, పాలకొల్లు కాలేజీకి రూ.475 కోట్లు, ఆదోని కాలేజీకి రూ.475 కోట్లు మొత్తంగా 10 కాలేజీల నిర్మాణానికి రూ.4855 కోట్ల నిధులు అవసరం. ఈ కాలేజీల నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించేందుకు బ్యాంకర్ల చుట్టూ ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికీ తిరుగుతున్నారు. కానీ ఫలితం లేకుండా పోతోంది.
Read more