Bonda Uma: 3 రాజధానులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా?

ABN , First Publish Date - 2022-10-07T22:00:25+05:30 IST

దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు తప్ప, 3 రాజధానులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా?..

Bonda Uma: 3 రాజధానులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా?

అమరావతి (Amaravathi): దోచుకో, దాచుకో, పారిపో అనే మూడు విధానాలు తప్ప, 3 రాజధానులపై ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు సహా, విశాఖను దోచుకోవడమేనా రాజధాని పేరుతో జగన్మోహన్ రెడ్డి (CM Jagan)  చేసిన అభివృద్ధి వికేంద్రీకరణ అని నిలదీశారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు చీరలు కొనిపెడతానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తీరుందని ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల్ని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనీయమనే వారి చొక్కాలు పట్టుకోవడానికి ఉత్తరాంధ్రవాసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతాలు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌ల జాగీర్లు కాదన్నారు. అమరావతి రైతుల్ని అవహేళన చేయకుండా మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నామన్నారు.


వికేంద్రీకరణకు అసలైన అర్థంచెప్పి, దాన్ని ఆచరణలో చూపిన ఘనత చంద్రబాబుదేనని బోండా ఉమ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రికి, మంత్రులకు అర్థమే తెలియదని విమర్శించారు. 4 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారనేది సుస్పష్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి హాయాంలో ఏ జిల్లాలో అయినా కోటిరూపాయల అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన దాదాపు రూ.12 వేల కోట్ల నిధులు ఏమయ్యాయో తెలియదన్నారు. ఒక్క రాజధాని కట్టలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతారా? అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, కాపులు, బ్రాహ్మణుల సంక్షేమానికి గత ప్రభుత్వం కేటాయించిన వేల కోట్లను జగన్మోహన్ రెడ్డి దారిమళ్లించింది వాస్తవంకాదా? అన్నారు. అమరావతికి, ఆ ప్రాంత రైతులకు ప్రజల్లో ఆదరాభిమానాలు పెరగడాన్ని చూసి ఓర్వలేకనే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రకరణలో భాగంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయగలరా? అని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతవాసులకు ఈ ప్రభుత్వ దోపిడీ తెలిసొచ్చింది కాబట్టే, అమరావతి రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని బోండా ఉమ వ్యాఖ్యానించారు.

Read more