రక్తమోడిన దేవరగట్టు

ABN , First Publish Date - 2022-10-07T08:58:48+05:30 IST

రక్తమోడిన దేవరగట్టు

రక్తమోడిన దేవరగట్టు

దేవర కోసం భక్తుల జైత్రయాత్ర

కర్రల సమరంలో పగిలిన తలలు 

86 మందికి గాయాలు

గుండెపోటుతో కర్ణాటక భక్తుడి మృతి

మీడియాను అనుమతించని పోలీసులు


హోళగుంద, అక్టోబరు 6: దేవరగట్టులో కర్రల సమయం కొనసాగింది. దేవర కోసం సాగించిన జైత్రయాత్రలో తలలు పగిలి రక్తం చిందింది. జోరు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా బన్ని ఉత్సవం నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు క్షేత్రంలో విజయ దశమి పర్వదినాన తమ ఇష్టదైవం శ్రీమాళ మల్లేశ్వరుల కల్యాణోత్సవం, అసురలపై దేవతలు సాధించిన విజయోత్సవం జైత్రయాత్ర సంప్రదాయంబద్ధంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. రథ వీధులు, కొండల్లో ఎటు చూసినా జనమే కనిపించారు. తొలుత హొళగుంద మండలం నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తజనం తమ ఇష్టదైవం శ్రీమాళ మల్లేశ్వరస్వాముల రక్షణార్థులై వేలాదిగా డొల్లబండ వద్దకు చేరుకున్నారు. హింసకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించి దిగ్విజయం చేద్దామని పాలతో బాసలు చేశారు. ఇనుప రింగులు చుట్టిన పట్టుడు కర్రలు.. కాగడా(దివిటీ)లు చేతపట్టి దేవరగట్టు వైపు కదిలారు. కుండపోతగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా కాళరాత్రిలో బండారు(పసుపు) చల్లుకుంటూ.. ‘డిర్ర్‌ర్ర్‌ర్ర్‌ గోపరాక్‌’ (బహుపరాక్‌) అంటూ తోటివారిని ఉత్సాహ పరుస్తూ ఇష్టదైవం కొలువైన కొండపైకి చేరుకున్నారు. అప్పుడు సమయం 12.45 గంటలు. ఆలయ పూజారి గిరిమల్లయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రీమాళ మల్లేశ్వరులకు కల్యాణోత్సవం నిర్వహించారు. జైత్రయాత్రకు సై అన్నట్లుగా గాలిలో ఐదో ఔటు (బాణసంచా) పేల్చారు. అర్ధరాత్రి 1.15 గంటలకు ఉత్సవమూర్తులతో కొండ దిగి సింహాసనకట్టకు చేరుకున్నారు. కట్టపై ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి మహా మంగళారతి ఇచ్చారు. తమ ఇష్టదైవం రక్షణార్థులై నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామస్తులు పల్లకీ చుట్టూ చేరుకోగా.. దేవుడిని తమ వశం చేసుకోవాలని ఎల్లార్తి, సులావాయి, విరుపాపురం, అరికెర, అరికెర తండా, బిలేహాలు తదితర గ్రామాల భక్తులు వారిని అడ్టుకున్నారు. క్షణాల్లో వేలాది కర్రలు గాల్లో తలలపై నాట్యమాడాయి. దేవర కోసం రెండు వర్గాల మధ్య హోరాహోరీగా సాగిన బన్ని ఉత్సవం కర్రల యుద్ధాన్ని తలపించింది. ఈ సమరంలో 86 మందికి గాయాలయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వారికి చికిత్స చేశారు. కొందరు గాయాలకు బండారు రాసుకొని వెళ్లిపోయారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ ఉత్సవంలో నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామస్తులే విజయం సాధించారు. అనంతరం దట్టమైన అడవిలోని పాదాలకట్ట, ముళ్లబండ, రక్షపడకు చేరుకొని పూజలు చేశారు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో బసవన్న గుడి వద్ద ఆలయ ప్రధాన పూజారి గిరిమల్లయ్య స్వామి కార్ణీకం(దైవవాణి) వినిపించారు. ఆంధ్ర, కర్ణాటకకు చెందిన దాదాపు 200 గ్రామాలు రైతులు దైవవాణిని అనుసరిస్తారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను సింహాసన కట్టకు చేర్చడంతో జైత్రయాత్ర ముగిసింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు 2లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. 


భారీ బందోబస్తు 

జైత్రయాత్రలో గాయాలైన వారి ఫొటోలు తీసేందుకు పాత్రికేయులను పోలీసులు అనుమతించలేదు. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చి కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలుకా మాటేసూగూరుకు చెందిన రవీంద్రారెడ్డి (17) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. 


Updated Date - 2022-10-07T08:58:48+05:30 IST