AP Special Status Issue: చంద్రబాబు చెబితే నేను మార్చడమా... ఏంటిది : MP GVL
ABN , First Publish Date - 2022-02-14T19:24:15+05:30 IST
ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించడం వెనక తన హస్తం ఉందంటూ...

అమరావతి : ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించడం వెనక తన హస్తం ఉందంటూ వచ్చిన వార్తలు, వైసీపీ విమర్శలను బీజేపీ ఎంపీ జీవీఎల్ తిప్పికొట్టారు. సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించటం వెనుక.. నా హస్తం ఉందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అది ముమ్మాటికి అవాస్తవం. చంద్రబాబు చెబితే మేము మార్చడమా..? ఇంత సిగ్గులేకుండా వైసీపీ నాయకులు మాట్లాడతారా?.. అసలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని మేము మార్చగలమా.. అది సాధ్యమయ్యే పనేనా..?’’ అని విమర్శకులను ఎంపీ ప్రశ్నించారు. ప్రజలు కూడా వైసీపీ చేస్తున్న రాజకీయ క్రీడలను అర్ధం చేసుకోవాలని జీవీఎల్ పేర్కొన్నారు.
లేఖ సారాంశం ఇదీ..!
మీడియా మీట్‌కు ముందు హోంశాఖ సెక్రటరీ అజయ్‌కుమార్ భల్లాకు ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల సమావేశాన్ని లేఖలో ప్రస్తావించారు. సమావేశ ఎజెండాలో తొలుత 9 అంశాలు చేర్చారని.. ఎజెండా సవరించి 5 అంశాలకు కుదించారన్నారు. సవరించిన ఎజెండాతో ఏపీలో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఎజెండాలో 4 అంశాల తొలగింపుకు గల కారణాలు భేటీలో వివరించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని విభజన సమయంలో బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. హోదా అంశంపై ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు.
హోదా అంశం వ్యవహారమేంటి.. అసలేం జరిగింది..!?
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది అంశాలతో ఎజెండాను తయారు చేసింది. అయితే ఈ తొమ్మిది అంశాల్లో నుంచి అనూహ్యంగా నాలుగు అంశాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించడం విమర్శలకు దారి తీసింది. దీనికి కర్త, కర్మ, క్రియ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావే అని.. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు విని హోదా అంశాన్ని తొలగించారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. దీనిపై జీవీఎల్ తాజాగా స్పందిస్తూ పై విధంగా స్పష్టతనిచ్చారు.