ముర్ముపై రామకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు: Vishnuvardhan reddy

ABN , First Publish Date - 2022-06-28T17:05:03+05:30 IST

గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముర్ముపై రామకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు: Vishnuvardhan reddy

అమరావతి: గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)పై సీపీఐ నేత రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి(S.Vishnuvardhan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ముర్ముపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు. గిరిజన అభ్యర్థి రబ్బరు స్టాంపు రాష్ట్రపతి అవుతుందని అనడానికి రామకృష్ణకు సిగ్గు అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. కమ్యూనిస్టులను గిరిజన సమాజం నుండి బహిష్కరించాలన్నారు. మహిళల పట్ల కమ్యూనిస్టులకు చిన్నచూపు ఉందని విమర్శించారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారి గిరిజనులకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తే, అది చూసి ఓర్వలేని కమ్యూనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా కనీసం ఉనికి లేకపోయినా, ప్రజలు ఛీత్కరించినా వారి ఆలోచనలలో మార్పు రాకపోగా గిరిజనుల మీద తమ ద్వేషాన్ని వెళ్లగక్కడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 


ద్రౌపది ముర్ముపై రామకృష్ణ ఏమన్నారంటే...

తన సొంత ఊరికి కరెంటు సౌకర్యం కల్పించలేని ద్రౌపది ముర్ము గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలని  ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి కూడా తన సొంత ఊరు అభివృద్ధిని ద్రౌపది ముర్ము విస్మరించారన్నారు. ఇన్నేళ్లు పట్టనట్లుండి ఇప్పుడు మీడియాలో కథనం రావడంతో ఆగమేఘాల మీద ఆ ఊరికి కరెంట్ ఏర్పాటు సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమె రాష్ట్రపతి అయితే గిరిజన వర్గాలకు మేలు జరుగుతుందా?... లేక రబ్బరు స్టాంపు రాష్ట్రపతి అవుతుందా? అని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-28T17:05:03+05:30 IST