BJP నేతలపై దాడికి ఆ ఎమ్మెల్యేనే కారకుడు: Somuveerraju
ABN , First Publish Date - 2022-06-28T20:56:37+05:30 IST
ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో బీజేపీపై నేతలపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు.

అమరావతి: ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో బీజేపీపై నేతలపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somuveerraju) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పట్టపగలు పాత్రికేయుల సమావేశంలో ఉండగా మారణాయుధాలతో వచ్చి హత్యకు ప్రయత్నం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఎమ్మెల్యే కారుకుడని ఆరోపించారు. డీఐజీ, ఎస్పీలతో ఘటనపై మాట్లాడినట్లు చెప్పారు. దాడి చేస్తానని ఎమ్మెల్యే ముందుగా ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా సంఘటనలను ప్రభుత్వం నిలువరించకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని సోమువీర్రాజు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే...
ధర్మవరం ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కట్టెలు, రాడ్లు చేతిలో పట్టుకుని స్కోర్పియో వాహనాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరులు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. దాడిని పక్కదోవ పట్టించడంలో భాగంగా ఎల్లో కలర్ షర్ట్స్ వేసుకుని వైసీపీ గ్యాంగ్ రావడం గమనార్హం. అయితే బీజేపీ నేతలు దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ముఖ్య అనుచరుడు గొట్లూరు మారుతీ మనుషులుగా చెబుతున్నారు. ఐదు నిమిషాల్లో దొరికిన వారిని దొరికినట్లు వైసీపీ గ్యాంగ్ చితక్కొట్టింది. రోడ్డుపై ఉన్న బీజేపీ నేతలపై వెంటపడి రాడ్లతో దాడికి పాల్పడ్డారు.
కాగా... వైసీపీ ప్లీనరీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు.