Police jobs: పోలీసు పోస్టుకు గట్టి పోటీ

ABN , First Publish Date - 2022-12-16T00:54:33+05:30 IST

పోలీసు ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (ఏపీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) ఇటీవల 411 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తోంది.

Police jobs: పోలీసు పోస్టుకు గట్టి పోటీ

6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 3.5 లక్షల దరఖాస్తులు

మరో రెండు వారాల గడువు.. 5 లక్షలు దాటే అవకాశం

ఎస్‌ఐ పోస్టులు 411.. 25 వేల దరఖాస్తులు

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలీసు ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (ఏపీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) ఇటీవల 411 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తోంది. గురువారంనాటికి కానిస్టేబుల్‌ పోస్టులకు 3.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 28వరకూ దరఖాస్తులకు గడువు ఉండటంతో కనీసం 5 లక్షలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఈ రెండు రోజుల్లోనే 25 వేల మంది అప్లై చేసుకున్నారు. దీనికి జనవరి 1 వరకూ గడువు ఉండటంతో ఇవి కూడా 2 లక్షలు దాటొచ్చని భావిస్తున్నారు. 1998 జూలై 2 తర్వాత.. 2004 జూలై 1 (18-24ఏళ్లు)కి ముందు జన్మించి ఇంటర్మీడియట్‌ పాసైన వారిని కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హులుగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేర్కొంది.

ఎస్‌ఐ పోస్టులకు 1995 జూలై 2 తర్వాత.. 2001 జూలై 1 (21-27ఏళ్లు)కి ముందు జన్మించి డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు వయో పరిమితిలో రెండేళ్లు సడలింపు ఇవ్వాలనే వినతులు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచినందున నియామకాల్లోనూ రెండేళ్లు అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూపీఎ్‌ససీలో ఇలా జరిగిందని, ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్లు ఉన్నప్పుడు రిక్రూట్‌మెంట్‌ వయసు 25గా ఉండేదని, 60కి పెంచాక దాన్ని 27కు పెంచిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే విధానాన్ని పోలీసు నియామకాల్లోనూ అమలు చేయాలని, మూడేళ్లుగా నోటిఫికేషన్‌ ఇవ్వనందున తాము నష్టపోతున్నామని వయసు పైబడిన యువత కోరుతోంది. జగన్‌ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సడలింపు ఇస్తే దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.

తప్పులుంటే సరిచేసుకోవచ్చు..

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే సరిదిద్దుకోవచ్చని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, కులం, ఎస్‌ఎ్‌ససీ రోల్‌ నంబర్‌ మినహా.. చిరునామా, విద్యార్హత లాంటి ఇతరత్రా అంశాల్లో పొరపాటు పడితే సరిచేసుకోవచ్చని పేర్కొంది. వివరాల కోసం ఏపీఎ్‌సఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వ పనిదినాల్లో 94414 50639 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని తెలిపింది.

Updated Date - 2022-12-16T00:54:57+05:30 IST