పందేలకు రెడీ
ABN , First Publish Date - 2022-12-15T03:10:49+05:30 IST
సంక్రాంతి అంటే మూడురోజుల పండగే కావొచ్చు. కానీ ఆ పండక్కి ప్రధాన ఆకర్షణగా నిలిచే పందెం కోళ్లను సిద్ధం చేయాలంటే.. ఏడాదంతా శ్రమించాల్సిందే.
సంక్రాంతికి సిద్ధమవుతున్న పందెం కోళ్లు
కోట్ల రూపాయల్లో కోళ్ల వ్యాపారం
పుంజు ధర రూ.50 వేల నుంచి పది లక్షల వరకు
భీమవరంలో లాడ్జీలన్నీ హౌస్‌ఫుల్
నెల రోజుల ముందే పండగ సందడి
భీమవరం, తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 14: సంక్రాంతి అంటే మూడురోజుల పండగే కావొచ్చు. కానీ ఆ పండక్కి ప్రధాన ఆకర్షణగా నిలిచే పందెం కోళ్లను సిద్ధం చేయాలంటే.. ఏడాదంతా శ్రమించాల్సిందే. పందెం కోళ్లను ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం చేసే వాళ్లు కొందరైతే.. మంచి జాతులను ఏరి కోరి కొనుక్కునేవారు మరెందరో!. సంక్రాంతి నెల రోజులే ఉండటంతో పందేల రాయుళ్లు పుంజుల కొనుగోళ్లపై దృష్టిసారించారు. మరోవైపు పండక్కి స్వగ్రామాలకు వచ్చేవారు రైలు, బస్సు టికెట్లను రెండు మూడునెలల ముందే బుక్ చేసుకున్నట్టుగానే.. ఉభయ గోదావరి జిల్లాల్లోని హోటళ్లు, లాడ్జీలను సైతం ముందే రిజర్వు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా కోడిపందేలను చూసేందుకు ఇక్కడికి వచ్చేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. కరోనా సంవత్సరం మినహా ఇక్కడ సంబరాలు ఏమాత్రం తగ్గలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పండుగకు ఇంకా నెల ఉండటంతో భీమవరం పట్టణంలో హోటళ్లు, లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయాయి. ఒకటీ, రెండు ఖాళీలున్నా.. యజమానులు వాటిని డిమాండ్‌ను బట్టి సిఫారసుల మేరకు కేటాయిస్తుంటారు. హోటళ్లు, లాడ్జిలు ఫుల్‌కావడంతో ప్రైవేటు అతిథి గృహాలు, విద్యా సంస్థలకు చెందిన గెస్ట్ హౌస్‌లు, క్లబ్‌లకు చెందిన గదులను సైతం ముందుగానే సిద్ధంచేసుకుంటుంటున్నారు. బంధువులు, స్నేహితులకు ఎలాగూ వారి నివాసాల్లో వసతి లభిస్తుంది. భీమవరంలో చెప్పుకోదగిన హోటళ్లు, 10, లాడ్జీలు 20ఉన్నాయి. మరోవైపు పండగ రోజుల్లో గోదావరి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. హోటళ్లలో వ్యాపారం ఎక్కువగానే సాగుతుంది. ప్రత్యేకమైన నాన్‌వెజ్ రుచుల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నాన్‌వెజ్ మెనూలో ఆక్వా, సీ ఫుడ్, భీమవరం స్పెషల్ వంటకాలను ప్రత్యేకంగా సిద్ధం చేస్తుంటారు. కొందరు ముందుగానే ఆర్డర్లు ఇస్తుంటారు.
జాతి.. పుంజు రకాన్ని బట్టే రేటు
పందెంకోళ్ల ధరలు లక్షలు పలుకుతున్నాయి. కొన్ని జాతుల పుంజులను రూ.50వేల నుంచి 10లక్షల వరకూ విక్రయిస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు జాతి పుంజుల కోసం తిరుగుతున్నారు. మేలురకం పందెం పుంజుల ఉత్పత్తి ఓ ప్రత్యేక పరిశ్రమ వంటిదే. ఇందుకోసం మేలుజాతి పుంజులతో జతకట్టే పెట్టల నుంచి గుడ్లు సేకరిస్తారు. ఆ గుడ్లను అదే రకమైన పెట్టలు పొదిగేలా చూస్తారు. ఈ రకమైన పందెం పుంజుల ఉత్పత్తి కోసం రెండు మూడు గుడ్లే పొదిగేలా చూసుకుంటారు. పొదిగిన పిల్లల్లో ఒకటి పుంజు మరొకటి పెట్ట అవుతుంటాయి. అలావచ్చిన పుంజులను అప్రమత్తంగా చూసుకుంటూ ప్రత్యేక ఆహారం ఇస్తారు. గుడ్డు పిల్లగా మారినప్పటినుంచే వాటి సంరక్షణ చూసేందుకు ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేస్తారు. పుంజులకు ఆహారంగా తృణధాన్యాలు(చోళ్లు, గంట్లు, రాగులు) జీడిపప్పు, బాదంతోపాటు మేక మాంసం ఇస్తుంటారు. వాటితో వ్యాయామం కూడా చేయిస్తారు. ఈత కొట్టించడం, కాళ్లు సాగదీయడం, కసరత్తులు చేయించడం, తోటి పుంజులతో తలపడే విధంగా డింకీ పందేలు వేస్తుంంటారు. మేలు రకం పుంజుల ఎంపికలో వాటి రంగు, జాతి కీలకంగా ఉంటాయి. కొనుగోలుదారులు పుంజుల హిస్టరీతోపాటు వాటిని విక్రయించే వారి చరిత్రనూ పరిశీలిస్తారు. అందువల్లే పుంజుల ధరలు లక్షల్లో ఉంటాయి. గతంలో ఈ తరహా పుంజులను బొబ్బిలి నుంచి దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తయారీ కేంద్రాలు ఎక్కువగానే ఉన్నాయి. జిల్లాలోని భీమవరం, వెంప, తాడేపల్లిగూడెం, అయి భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని పుంజులకు బాగా డిమాండ్ ఉంది.