బార్‌ పాలసీ అపహాస్యం

ABN , First Publish Date - 2022-08-04T09:03:10+05:30 IST

బార్‌ పాలసీ అపహాస్యం

బార్‌ పాలసీ అపహాస్యం

సకాలంలో కట్టకపోతే లైసెన్సు రద్దు

పాలసీ రూల్స్‌లో స్పష్టంగా నిబంధన

ఆలస్యంగా కట్టినా అనుమతిస్తున్న ఎక్సైజ్‌

మంత్రి పీఎస్‌ కోసమే వెయిటింగ్‌?


అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): సిండికేట్ల వ్యవహారంతో బార్‌ పాలసీ వేలం ప్రక్రియ తీవ్ర విమర్శలపాలు కాగా... ఇప్పుడు అధికారుల తీరుతో మరింత అపహాస్యం పాలవుతోంది. లైసెన్సు రుసుముల చెల్లింపులో ఎక్సైజ్‌ శాఖ వ్యవహరిస్తున్న తీరు కొత్త అనుమానాలకు తావిస్తోంది. తానే రూపొందించిన నిబంధనలను ఆ శాఖే ఉల్లంఘిస్తోంది. వేలంలో లైసెన్సు దక్కించుకున్నవారు అదే రోజు.. ఒకే విడతలో రుసుములన్నీ చెల్లించాలని బార్‌ పాలసీ రూల్‌ 17లో స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ ఆ రోజున బ్యాంకులకు సెలవు దినం అయితే ఆ మరుసటి రోజు చెల్లించాలి. లేనిపక్షంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే లైసెన్సు రద్దు చేయాలని రూల్‌ 18లో స్పష్టంగా పేర్కొంది. కాగా గత శని, ఆదివారాల్లో జరిగిన వేలంలో లైసెన్సులు దక్కించుకున్నవారిలో చాలామంది ఈ నిబంధనలను పాటించలేదు. శని, ఆదివారాల్లో వేలం జరిగినందున అందరూ సోమవారం రుసుములు చెల్లించాల్సి ఉండగా చాలామంది ఇప్పటికీ చెల్లిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో కూడా చెల్లింపులు జరుగుతూనే ఉన్నాయి.  విజయవాడలో బుధవారం సాయంత్రానికి కూడా ఆరు బార్లకు ఫీజులు చెల్లించలేదని తెలిసింది. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 30 వరకూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా నూతన బార్‌ పాలసీలో రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు, బెదిరింపులు, సిండికేట్ల వ్యవహారం తీవ్రస్థాయిలో నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి చెందిన వారికే ఎక్కువగా లైసెన్సులు దక్కాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రుసుముల చెల్లింపుల్లోనూ ఎక్సైజ్‌ శాఖ ఉదాసీనంగా ఉండటం అనుమానాలు కలిగిస్తోంది. 


మూడు బార్లు దక్కించుకుని.. 

తమకు కావాల్సిన వారితోపాటు ఓ మంత్రి పీఎస్‌ కోసం కూడా ఈ ఉల్లంఘనల పర్వం సాగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ మంత్రి పేషీలో పీఎ్‌సగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి విజయవాడలో బినామీ పేర్లతో మూడు బార్లకు లైసెన్సులు దక్కించుకున్నట్లు తెలిసింది. మంత్రి పేరు చెప్పి అధికారులు, సిండికేట్లపై పెత్తనం చెలాయించి వేర్వేరు పేర్లతో లైసెన్సులు దక్కించుకున్న ఆ వ్యక్తి .. తీరా రుసుములు చెల్లించాల్సి వచ్చేసరికి చేతులెత్తేశారు. బుధవారం సాయంత్రానికి కూడా ఆ మూడు బార్లకు ఫీజులు కట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.  లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తే.. పోటీ నుంచి తప్పుకొనేందుకు రెండు మూడు రెట్లు నగదు ఆఫర్‌ చేస్తారనే ఉద్దేశంతో మూడు బార్లకు దరఖాస్తు చేశారని, తీరా ఆఫర్లు రాకపోవడంతో బార్లు పెట్టే ధైర్యం లేక ఇరుక్కుపోయారనే చర్చ సాగుతోంది.

Updated Date - 2022-08-04T09:03:10+05:30 IST