Amaravati: కన్నీటి పర్యంతమైన రాజధాని రైతులు

ABN , First Publish Date - 2022-09-18T02:49:44+05:30 IST

గ్రామాల్లో మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు.. పోలీసుల మోహరింపు.. రైతుల్లో భావోద్వేగ వాతావరణం..

Amaravati: కన్నీటి పర్యంతమైన రాజధాని రైతులు

బాపట్ల: గ్రామాల్లో మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు.. పోలీసుల మోహరింపు..  రైతుల్లో భావోద్వేగ వాతావరణం.. వీటి మధ్య ఆరో రోజు శనివారం బాపట్ల జిల్లా (Bapatla District)లో మహాపాదయాత్ర సాగింది. చెరుకుపల్లి మండలం ఐలవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడినుంచి కనగాల మీదగా గూడవల్లి పొలిమేర నుంచి రాజోలు వైపు పాదయాత్ర సాగింది. ఇక్కడ భోజన విరామం అనంతరం బడేవారిపాలెం, తూర్పుపాలెం మీదగా నగరం చేరుకోవడంతో  యాత్రకు విరామం ప్రకటించారు. ఆరో రోజు దాదాపు 15 కిలోమీటర్ల మేర రైతులు మహాపాదయాత్ర సాగింది. కనగాల గ్రామ శివారులో వేలాది మంది జనం హరిత జెండాలు పట్టుకుని రైతులకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి  మొదలైన జన జాతర నగరం చేరేవరకు అలాగే సాగింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన రాజధాని రైతులు ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యారు. దారి వెంబడి ఉన్న ప్రతిగ్రామంలో ప్రజలు రాజధాని రైతులపై పూలవర్షం కురిపించారు. ఎమ్మెల్యే అనగానికి స్థానికులు హారతులివ్వబోగా తనకు కాదు రైతులకు ఇవ్వాలనడంతో ఒక్కసారిగా జై అమరావతి నినాదాలు మిన్నంటాయి. హైదరాబాద్‌ నుంచి 40 మంది సభ్యులతో వచ్చిన బృందం మహాపాదయాత్రలో రైతులతో కలిసి అడుగులేసింది.  


మూడు రాజధానుల ఫ్లెక్సీల వద్ద బందోబస్తు

పాదయాత్రసాగే దారిలో ఉన్న కనగాల, రాజోలు, తూర్పుపాలెం, నగరం ప్రాంతాల్లో మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీ వర్గీయులు ఫ్లెక్సీలు కట్టారు. శనివారం ఈ మార్గంలోనే పాదయాత్ర సాగింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు మోహరించి ఆయా ఫ్లెక్సీల వద్ద రక్షణగా నిలిచారు. ఫ్లెక్సీ ఉన్న ప్రతిచోట ముగ్గురు పోలీసులు భద్రత ఇచ్చారు. ఇరుకుగా ఉన్న ఆ మార్గంలో ట్రాఫిక్‌ అవాంతరం కలిగినా పోలీసులు పట్టించుకోలేదు. అయినా పాదయాత్రికులు, వారికి మద్దతుగా వచ్చిన వారు ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా యాత్రను ముందుకు కొనసాగించారు. ఫ్లెక్సీల జోలికి కూడా వెళ్లలేదు. పోలీసులు పట్టించుకోకపోయినా భారీ వాహనాలకు దారిస్తూ రైతులు పాదయాత్ర సాగించారు.  


గూడవల్లి వద్ద స్వల్ప ఉద్రిక్తత

కనగాల నుంచి పాదయాత్ర గూడవల్లి శివారు చేరుకోగానే స్థానికులు తమ గ్రామంలోకి రైతులు రావాలని పట్టుబట్టారు. పోలీసులు మాత్రం అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులతో కలిసి అక్కడకు చేరుకున్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ గ్రామస్థులకు నచ్చచెప్పబోయారు. కానీ రైతులు ససేమిరా అనడంతో రైతులు కాకుండా తాను మాత్రం గూడవల్లి ఊళ్లోకి వెళ్లి రావడంతో గ్రామస్తులు శాంతించారు.

Updated Date - 2022-09-18T02:49:44+05:30 IST