బాబుకు బస...భరించలేక..!

ABN , First Publish Date - 2022-12-07T02:39:26+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం బాపట్లకు వెళతారు. ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొని ఆ రాత్రికి బాపట్లలోనే ఆయన బస చేస్తారు.

బాబుకు బస...భరించలేక..!

‘ఇదేం ఖర్మ...’ కోసం 9న బాపట్లకు స్థానిక కళాశాలలో రాత్రికి విడిది

యాజమాన్యంపై అనూహ్యరీతిలో వేధింపులు

బాపట్ల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం బాపట్లకు వెళతారు. ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొని ఆ రాత్రికి బాపట్లలోనే ఆయన బస చేస్తారు. స్థానికంగా మంచి పేరున్న బాపట్ల ఎడ్యుకేషనల్‌ సొసైటీ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీ క్యాంప్‌సలో చంద్రబాబు విడిదికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే అనూహ్యంగా సొసైటీ యాజమాన్యం టార్గెట్‌గా మారింది. మంగళవారం మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగారు. సరిగ్గా పన్నులు చెల్లించడం లేదంటూ సొసైటీ కింద నడుస్తున్న పబ్లిక్‌ స్కూలుకు వెళ్లి కొలతలు తీసుకున్నారు. సొసైటీ కార్యాలయంలో రికార్డులను రోజంతా తనిఖీ చేశారు. వాస్తవానికి, రాజకీయ ప్రముఖులకు రాజకీయాలకు అతీతంగా సొసైటీ నిర్వాహకులు అతిథ్యం ఇస్తున్నారు. గతంలో ఒకసారి ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఇంజనీరింగ్‌ కాలేజీ క్యాంప్‌సలో బస చేశారు.

అప్పట్లో విద్యాదీవెన పథకం ప్రారంభించడానికి వచ్చి.. రాత్రి బాపట్లలోనే ఆయన ఉండిపోయారు. కానీ, ఇంతకుముందు ఎన్నడూ సొసైటీ యాజమాన్యం ఇలా ఒత్తిడికి గురికాలేదు. చంద్రబాబు బాపట్ల పర్యటన ఖరారయ్యాకే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెబుతున్నారు. మరోవైపు అసైన్డ్‌ భూములను పాలకపార్టీ నాయకుల అండతో కొందరు కబ్జా చేయడంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. విషయం తెలుసుకుని వెళ్లి వారిపై వైసీపీ నేతలు, అధికారులు బెదిరింపుల అస్త్రాన్ని ప్రయోగించినట్టు తెలిసింది. కాగా, కీలకంగా వ్యవహరించే టీడీపీ నాయకులకు ప్రభుత్వం పెద్దల నుంచి హెచ్చరికలు అందుతున్నట్లు తెలుస్తోంది. చీరాల పరిధిలోని ఒక నాయకుడికి ఇప్పటికే బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. వైసీపీ అరాచకాలకు బలైన వివిధ వర్గాలు చంద్రబాబు పర్యటనలో ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలనినిర్ణయించుకున్నారు.

Updated Date - 2022-12-07T02:39:50+05:30 IST