రాళ్లు, కర్రలతో దాడికి..

ABN , First Publish Date - 2022-12-31T05:40:48+05:30 IST

చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో తెగబడ్డారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ నేతలను శుక్రవారం సోమల మండలం నంజంపేటలో అడ్డుకున్నారు.

రాళ్లు, కర్రలతో దాడికి..

ఇదేం కర్మ.. అడ్డగింతకు వైసీపీ యత్నం

తిరగబడ్డ టీడీపీ నేతలు, కార్యకర్తలు

పరస్పర రాళ్లదాడిలో ఎస్సైకి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరు, డిసెంబరు 30: చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో తెగబడ్డారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ నేతలను శుక్రవారం సోమల మండలం నంజంపేటలో అడ్డుకున్నారు. వీరి దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు రెండు గంటలపాటు అడ్డుకోవడం, దాడులకు దిగడంతో టీడీపీ శ్రేణులు సైతం గట్టిగానే ఎదుర్కొన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహించే పుంగనూరు నియోజకవర్గంలో ఇతర పార్టీ నేతల ఉనికిని కూడా సహించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు అడ్డుకుంటాయని ముందుగానే భావించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలోనే సోమల మండలం పెద్దఉప్పరపల్లెలో జరిగే కార్యక్రమానికి బయలుదేరారు. మరోవైపు పక్క మండలమైన చౌడేపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట జరుగుతోంది. దీంతో వైసీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. తొలుత సోమల దళితవాడలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డిని వెళ్లనీయకుండా దాదాపు 100 మంది రోడ్డుపై అడ్డుకున్నారు. ఓ వ్యక్తి జనంలోంచి విసిరిన రాయి చల్లా కారు అద్దానికి తగిలి పగిలింది. టీడీపీ శ్రేణులు ఎదురు తిరగడం, పోలీసులు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు నంజంపేటకు వెళ్లారు. నంజంపేటలో సర్పంచి వెంకటరెడ్డి, వైసీపీ శ్రేణులు చల్లా కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అయితే, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండటంతో వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గారు. దీంతో 10 వాహనాలు, సుమారు 150 మోటారు సైకిళ్లు ముందుకు వెళ్లగా.. వెనుక ఉన్న మరికొన్ని వాహనాలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. 5 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ వాహనాలు రాకపోవడంతో ముందుకు వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చారు. వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయగా.. టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు. పరస్పర రాళ్ల దాడితో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ కాలు విరగ్గా.. పలువురికి గాయాలయ్యాయి. తాను పెద్దఉప్పరపల్లెకు వెళ్లాల్సిందేనంటూ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వైసీపీ అరాచకాన్ని, పోలీసుల చర్యను ఖండిస్తూ చల్లా రామచంద్రారెడ్డి, నాయకులు వెనక్కి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా పక్క మండలంలోనే ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమీ ఎరుగనట్టే వ్యవహరించారు.

Updated Date - 2022-12-31T05:40:48+05:30 IST