అప్పట్లో వైఎస్‌, జగన్‌... ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?

ABN , First Publish Date - 2022-09-29T09:31:01+05:30 IST

అప్పట్లో వైఎస్‌, జగన్‌... ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?

అప్పట్లో వైఎస్‌, జగన్‌... ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?

జరుగుతున్న తప్పులు చెప్పలేని మీరే వెధవలు 

అంబటి వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ ధ్వజం 

ఏలూరులో మహాపాదయాత్రకు జననీరాజనం 


ఏలూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తరువాత జగన్‌, ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.. వాళ్లూ ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?’ అంటూ అమరావతి పరిరక్షణ రైతు సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రైతుల పాదయాత్ర ఒళ్లు బలిసినవారు చేస్తున్నదంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలపై జేఏసీ తీవ్రస్థాయిలో మండిపడింది. జేఏసీ కో-కన్వీనర్‌ తిరుపతిరావు బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడారు. ఒక మంత్రి మమ్మల్ని వెధవలు అంటాడు. మేము కాదు.. జరుగుతున్న తప్పులను చెప్పలేని మీరే వెధవలని మండిపడ్డారు. ఒళ్లు బలిసిందని పాదయాత్రలో ఉన్న రైతులనుద్దేశించి అంటారా? మీ పదవులు కాపాడుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం, సీఎం జగన్‌ మెప్పు కోసం మీరే ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని తిప్పికొట్టారు. ‘‘25ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని ఓ మంత్రి అంటున్నారు. తన పదవీ కాలంలో ఆస్తులు పెంచుకోవడానికి, ఢిల్లీలో సొంత ఇళ్లు కట్టుకోవడానికి, తనవారికి పదవులు ఇప్పించుకోవడానికి ఈ మూడున్నరేళ్లు సరిపోయింది. ఇంతకంటే రాష్ట్రానికి ఏం చేశారు?’’ అంటూ పరోక్షంగా మంత్రి బొత్సనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.  


ఏలూరులో ‘జై అమరావతి’ హోరు 

బుధవారం 17వ రోజున పెదపాడు మండలం కొత్తూరు కనకదుర్గ ఆలయం నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అక్కడినుంచి 3కిలోమీటర్లు ప్రయాణించి ఏలూరు నగరానికి చేరుకున్నారు. జన నీరాజనాలు, హోరెత్తిన నినాదాల మధ్య రైతులకు మద్దతుగా వచ్చిన జనసందోహంతో నగర వీధులన్నీ కిక్కిరిశాయి. ఇతర ప్రాంతాల నుంచీ రైతులు, వివిధ పార్టీల నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా మహిళలు పాదయాత్రకు ఎదురేగి ఆప్యాయంగా స్వాగతం పలికారు. ‘జై అమరావతి’ అంటూ నినదించారు. జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు నేతృత్వాన మహిళలంతా పసుపు నీరు బిందెల్లో తెచ్చి పాదయాత్రికులు ముందుకు సాగే ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఏలూరులో దాదాపు పది కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. నిర్విరామంగా 8గంటల పాటు రైతులపై పూల వర్షం కురిసింది. ఎటు చూసినా ఆకుపచ్చ తువాళ్లు రెపరెపలాడాయి. తమకు లభిస్తున్న ప్రజాదరణ, దీవెనలతో రైతులు మరింత ఉత్సాహంతో నడక సాగించారు. వ్యాపారులు, న్యాయవాదులు వారికి ఎదురేగి స్వాగతం పలికారు. పాతబస్టాండ్‌, వన్‌టౌన్‌ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. టీడీపీ, సీపీఎం, సీపీఐ, అమ్‌ ఆద్మీ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ నూజివీడు టీడీపీ నాయకుడు పర్వతనేని గంగాధర్‌ రూ.5లక్షలు విరాళం అందించారు. 


అసలు వీరు మంత్రులేనా?

‘‘పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. అసలు వీరు మంత్రులేనా? జగన్‌ మెప్పు కోసం ఇంతలా దిగజారిపోతారా? పదవులు, ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని  జేఏసీ నేత శివారెడ్డి విరుచుకుపడ్డారు. మంత్రులకు సంస్కారం, భాష ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘ఇల్లు, వాకిలి వదిలేసి అమరావతి కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలపై మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారు. ఇదే కామెంట్లు మీ ఇళ్లల్లో ఆడవారికి వర్తించవా? పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని మహిళా నేత రాయపాటి శైలజ హెచ్చరించారు.

Read more