గదిలో ఆ నలుగురు!

ABN , First Publish Date - 2022-02-23T07:52:16+05:30 IST

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున ఎర్ర గంగి రెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరితోపాటు మరో వ్యక్తి ఇంట్లో ఉన్నారని వాచ్‌మ్యాన్‌ రంగన్న తెలిపారు. వారందరూ..

గదిలో ఆ నలుగురు!

  • ఏం జరిగిందని గంగిరెడ్డిని అడిగా
  • నన్ను నెట్టేసి ‘నరుకుతా’ అన్నాడు
  • లోపలికి వెళ్లి చూశాను బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో వివేకా
  • గంగిరెడ్డికి భయపడి మాట్లాడలేదు
  • వాచ్‌మ్యాన్‌ రంగన్న వాంగ్మూలం
  • ఏదో వెతుకుతున్నట్లు తిరిగారు
  • ముగ్గురు పారిపోయారు


కడప, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున ఎర్ర గంగి రెడ్డి,  సునీల్‌ యాదవ్‌, దస్తగిరితోపాటు మరో వ్యక్తి ఇంట్లో ఉన్నారని వాచ్‌మ్యాన్‌ రంగన్న తెలిపారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా... వివేకా రక్తపు మడుగులో ఉన్నారని చెప్పారు. గత ఏడాది జూలై 23వ తేదీన జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ముందు రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. అందులో ఏముందంటే... ‘‘నేను రెండేళ్లుగా వివేకానంద రెడ్డి సార్‌ ఇంటికి వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నాను. 2019 మార్చి 14వ తేదీ రాత్రి 11.30 గంటలకు డ్రైవర్‌ ప్రసాద్‌, వివేకానందరెడ్డి సార్‌ కారులో వచ్చారు. పది నిమిషాల తర్వాత డ్రైవర్‌ ప్రసాద్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎర్ర గంగిరెడ్డి  వేగంగా ఇంట్లోకి వెళ్లారు. వివేకానందరెడ్డి ఎక్కడికి వెళ్లినా ఎర్ర గంగిరెడ్డిని తీసుకెళతారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వివేకా బయటికి వచ్చి కుర్చీలో కూర్చొని సిగిరెట్‌ తాగారు. ‘పొద్దుపోయింది. పడుకో’ అని నాతో అన్నారు. ఎర్ర గంగిరెడ్డి పోయాక, మెయిన్‌ గేటు వేసేసి పడుకుంటాను... అని నేను బదులిచ్చాను. గంగిరెడ్డి ఆ రాత్రికి ఇక్కడే ఉంటారని వివేకా చెప్పారు.


దీంతో నేను మెయిన్‌ గేటు వేసి, ఎప్పటిలాగానే మెయిన్‌ డోరు దగ్గర ఉన్న మెట్ల వద్ద పడుకున్నాను. ఇంట్లో నుంచి దడదడమని ఇనుప సామాన్ల శబ్దం రావడంతో మధ్యలో మెలకువ వచ్చింది. ఏమిటీ శబ్దం అనుకుంటూ ఉన్నాను. ఇంతలో ఆ.. ఆ.. అనే అరుపులు వినిపించాయి. ఏం జరిగిందో చూద్దామని మెయిన్‌ డోరు తలుపులు తెరవబోయాను. కానీ... తలుపులు తెరుచుకోలేదు. దీంతో నేను ఇంటికి వెనుకవైపున ఉన్న పార్కు వాకిలి వైపు వెళ్లి... అది నెట్టినా, తెరుచుకోలేదు. ఆ వాకిలి పక్కనే కిటికీ ఉంది. అందులో నుంచి బెడ్‌రూమ్‌ కనిపిస్తుంది. అందులో నుంచి చూడగా... బెడ్‌రూంలో నుంచి హాల్‌లోకి నలుగురు ఏదో పోగొట్టుకున్నట్లుగా తిరగడం కనిపించింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌, పాత డ్రైవర్‌ దస్తగిరి ఉన్నారు. నాలుగో వ్యక్తి పొడువుగా సన్నగా ఉన్నాడు. నేను ఆయనను ఇంతకు ముందు చూడలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని పార్కు వాకిలి పక్కన గుబురు చెట్ల మధ్య దాక్కున్నాను. 20 నిమిషాల తర్వాత ముగ్గురు ఇంటి పార్కు వాకిలి తెరుచుకుని బయటికి వచ్చి పడమటికి పారిపోయారు. వాళ్లు పోయిన తర్వాత ఎర్ర గంగిరెడ్డి ఆదరాబాదరాగా వచ్చారు. నేను ఆయనకు ఎదురెళ్లి... వాళ్లు ముగ్గురు పరిగెత్తారు.., లోపల ఏమి జరిగింది అని అడిగాను.


‘నాకేమీ తెలియదు. నీముందే వాళ్లు పారిపోయారు కదా!’ అంటూ నన్ను నెట్టేశారు. నేను గడ్డి మీద పడిపోయాను. ‘‘నీ కథ అయిపోయింది. నిన్ను ఎప్పుడు నరుకుతానో నరుకుతా’’ అంటూ గంగిరెడ్డి వెళ్లిపోయాడు. తర్వాత నేను పార్కు వాకిలి నెట్టగానే అది తెరుచుకుంది. బెడ్‌రూంలోకి పోయి చూస్తే... మూరెడు వెడల్పున రక్తం ఉంది. పరుపునకు ఒక మూలన రక్తం ఉంది. అక్కడ ఇంకెవరూ లేరు. వివేకానందరెడ్డి సార్‌ బాత్‌రూమ్‌లో ఉన్నారేమో అని చూశాను. అక్కడ కొళాయి వద్ద సార్‌ వెల్లకిలా పడిపోయి ఉన్నారు. మనిషంతా రక్తమే! దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. ఇది చూసి నేను భయంతో వణికిపోయాను. బయటికి వచ్చేశాను. ఎర్ర గంగిరెడ్డికి భయపడి ఏమీ చెప్పకుండా... భయంతో రగ్గు కప్పుకొని మెయిన్‌ డోర్‌ పక్కన పడుకున్నాను. కొద్ది సేపటికి కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ రెడ్డి వాళ్లు వచ్చారు. అప్పుడు సమయం 5 గంటలు అయి ఉంటుంది. సార్‌ లేచారా అంటే లేదు అన్నాను. వాళ్లిద్దరూ పేపర్‌ చదువుతూ కూర్చున్నారు. ఆ తర్వాత పనిమనిషి లక్ష్మమ్మ అక్కడికి వచ్చి కిటికీ తలుపు మీద తడుతూ ఉంది. వివేకానంద రెడ్డి సార్‌ బాత్‌రూమ్‌లో ఉంటే... ఈ శబ్దం విన్న తర్వాత తలుపు తీస్తారని చెప్పింది. తర్వాత... సార్‌ లేచారా, అని కృష్ణా రెడ్డి మరోసారి అడిగారు. లేదు.. అని చెప్పగానే, వెనుకవైపు వాకిలి వద్దకు వెళ్లి చూడాలని నాకు చెప్పారు. నేను వెనుక వైపు వాకిలి తోసుకుని లోపలికి వెళ్లాను. అప్పటికి రక్తం గడ్డ కట్టింది.


బాత్‌రూమ్‌లో వివేకానందరెడ్డి సార్‌ అంతకుముందు నేను చూసినప్పుడు ఎలా ఉన్నాడో అట్లే పడిపోయి ఉన్నాడు. నాకు కళ్లు బైర్లు కమ్మినాయ్‌. ‘సార్‌ లేడు... సార్‌ లేడు... అయిపోయినాడు’ అని తూలుకుంటూ వచ్చి పార్కులో పడిపోయాను. ప్రకాశ్‌, కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ నా పక్క నుంచే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత జనం బాగా వచ్చారు. పోలీసులు, రెండు కుక్కలను తీసుకుని వచ్చారు. లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లతో మాట్లాడుతున్నారు. బెడ్‌ ఎవరు కడిగారని అడుగుతున్నారు. అది విని నేను మళ్లీ అరుగుపైకి వచ్చి పడుకున్నాను. ఉదయం 6.30 - 7 గంటలకు సందులో నుంచి ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. ‘ఒరేయ్‌ రంగా’ అని నన్ను పిలిచారు.  ‘రేయ్‌... రాత్రి ఏం జరిగిందో చెబితే నిన్ను నరికి పారేస్తా’ అన్నారు. ఆయనకు భయపడే నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని రంగన్న తన వాంగ్మూలంలో వివరించారు.


గొడ్డలి నావద్దే కొన్నారు : కృష్ణమాచారి

వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలిని 2019 మార్చి 14న షేక్‌ దస్తగిరి రూ.450కు తన వద్దనే కొనుగోలు చేశాడని అనంతపురం జిల్లా కదిరికి చెందిన హార్డ్‌వేర్‌ షాపు యజమాని కరమల కృష్ణామాచారి తెలిపారు. ఆయన 2021 సెప్టెంబరు 3న ప్రొద్దుటూరు కోర్టు జడ్జి ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ‘‘2021 ఆగస్టులో సీబీఐ అధికారులు నన్ను విచారించారు. ఆ తర్వాత దస్తగిరిని చూపిస్తే నేను గుర్తుపట్టాను. దస్తగిరి అన్న షేక్‌ హాజీవలి తన వద్ద వ్యవసాయ పనిముట్లు, హార్డ్‌వేర్‌ సామగ్రి కొనుగోలు చేసేవాడని. అప్పుడప్పుడు ఆయనతో కలిసి షేక్‌ దస్తగిరి కూడా వచ్చేవాడు’’ అని కృష్ణమాచారి తెలిపారు.

Updated Date - 2022-02-23T07:52:16+05:30 IST