జనసేన నేతలపై హత్యాయత్నం కేసు

ABN , First Publish Date - 2022-10-17T09:56:30+05:30 IST

జనసేన నాయకులపై విశాఖ నగర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి సుమారు 100 మందికిపైగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. జనసేన వీరమహిళలను సైతం రాత్రి ఒంటి గంట సమయంలో మగ

జనసేన నేతలపై హత్యాయత్నం కేసు

అర్ధరాత్రి వంద మందికిపైగా అరెస్టు

చొక్కాలు పట్టుకొని తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు

స్త్రీలను మగ పోలీసులు పట్టుకోవడంపై జనసేన అభ్యంతరం

సెక్షన్‌ 30పై పోలీసుల వివక్ష!


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), పద్మనాభం, అక్టోబరు 16: జనసేన నాయకులపై విశాఖ నగర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి సుమారు 100 మందికిపైగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. జనసేన వీరమహిళలను సైతం రాత్రి ఒంటి గంట సమయంలో మగ పోలీసులు పట్టుకుని వాహనాల్లోకి ఎక్కించడం గమనార్హం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జనవాణి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం 4.30గంటలకు విశాఖ వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేశ్‌ విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు లోపలికి వెళుతుండగా... జనసేన కార్యకర్తలున్న వైపు నుంచి స్టీల్‌ చెత్తకుండీ మూత ఒకటి గాలిలో ఎగురుతూ వచ్చి మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడు దిలీప్‌కు తగింది. ఆయన తలకు గాయమవడంతో జనసైనికుల దాడిగా మంత్రులు ప్రచారం చేశారు. దిలీప్‌ రాత్రి 10గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దానిపై పోలీసులు 11గంటల సమయంలో 307సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి జనసేన కీలకనేతలు శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణ, కోన తాతారావు, సుందరపు విజయకుమార్‌, పంచకర్ల సందీప్‌, పీవీఎస్‌ఎన్‌ రాజు, బొడ్డేపల్లి రఘు, పీతల మూర్తి యాదవ్‌, కొల్లూరి రూప, తోటకూర మంగ, బొగ్గు శ్రీను తదితర వంద మందికిపైగా అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి నగరంలోని జనసేన నేతల ఇళ్లకు, పవన్‌ బసచేసిన నోవోటెల్‌ హోటల్‌కు వెళ్లి నాయకులను చొక్కాలు పట్టుకొని బయటకు తీసుకువచ్చి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. బలవంతంగా ఎందుకు తీసుకెళుతున్నారంటూ జనసేన వీరమహిళలు హోటల్‌ వద్ద పోలీసు వాహనాలను అడ్డుకోగా వారిని కూడా అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు వచ్చి జెండాకర్రలతో తమను కొట్టారని పెందుర్తి సీఐ బి.నాగేశ్వరరావు జనసైనికులపై కేసు పెట్టారు. ఆదివారం సాయంత్రానికి సుమారు 126మందిని అరెస్టు చేసినట్టు సమాచారం. శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన నాయకులను పద్మనాభం పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వారందరినీ విశాఖపట్నం తరలించారు. తమను అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారని, కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని జనసేన భీమిలి నియోజక వర్గ ఇన్‌చార్జి పంచకర్ల సందీప్‌ ఆరోపించారు.  

Updated Date - 2022-10-17T09:56:30+05:30 IST