కాటేసిన కడలి

ABN , First Publish Date - 2022-10-05T07:59:14+05:30 IST

కాటేసిన కడలి

కాటేసిన కడలి

ముగ్గురు పిల్లల మృతి

మరో ముగ్గురు గల్లంతు

బాపట్ల జిల్లా సూర్యలంకలో విషాదం 

అంతా విజయవాడ సింగ్‌నగర్‌ వాసులు

సెలవులని సరదాగా వచ్చిన 8 మంది

ఒడ్డునే ఉండి ప్రాణాలు దక్కించుకున్న ఒకరు

మెరైన్‌ సిబ్బంది కాపాడటంతో మరొకరు క్షేమం

కొనసాగుతున్న గాలింపు చర్యలు


బాపట్ల, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): వారంతా ఒకే ప్రాంతంలో నివసించేవారు. వారిలో కొందరు విద్యార్థులు. మరికొందరు పనులు చేసేవారు. దసరా సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో సరదాగా గడిపేందుకు ఎనిమిది మంది సముద్ర తీరానికి వచ్చారు. వారిలో ముగ్గురిని కడలి బలిగొంది. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగకుండా ఒడ్డునే ఉండటంతో ఒకరి ప్రాణాలు నిలిచాయి. మరొకరిని మెరైన్‌ సిబ్బంది కాపాడారు. బాపట్ల జిల్లా సూర్యలంకలో మంగళవారం జరిగిందీ ఘోరం. వారంతా విజయవాడలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలోని శాంతినగర్‌కు చెందినవారు. సముద్ర తీరానికి అంటే తల్లిదండ్రులు వద్దంటారని, వారిలో ఏడుగురు కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పారు. మరొకరు మాత్రం పెళ్లికి వెళ్తున్నామని చెప్పారు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి రైలులో బాపట్లకు వచ్చారు. అక్కడి నుంచి సూర్యలంక సముద్రతీరానికి చేరుకున్నారు. ఒకరు ఒడ్డున ఉండగా, మిగతా ఏడుగురు సముద్రంలోకి దిగారు. నీళ్లలో కేరితలు కొడుతూ ఆడుకుంటుండగానే లోపల ఉన్న గోతుల్లో పడిపోయారు. ఉన్నట్లుండి వారు కనబడకపోయేసరికి ఒడ్డున ఉన్న కైలాశ్‌ అనే విద్యార్థి కేకలు వేయడంతో మెరైన్‌ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లు వెంటనే అక్కడికి వచ్చి వసంత పరిశుద్ధరావు అనే విద్యార్థిని కాపాడారు. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టగా బెజ్జం అభిలాష్‌(17), చింతల సిద్ధు(17), సాయిమధు(15) మృతదేహాలు లభ్యమయ్యాయి. రాఘవ, ప్రభుదాస్‌, సర్వసిద్ధి ఫణికుమార్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతదేహాలకు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల్లో అభిలాష్‌ వాటర్‌ప్లాంట్‌ కార్మికుడు కాగా, సిద్ధు పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం, సాయిమధు పదో తరగతి విద్యార్థులు. గల్లంతైనవారిలో రాఘవ ఇంటర్మీడియెట్‌, ఫణికుమార్‌ తొమ్మిదో తరగతి విద్యార్థులు. ప్రభుదాస్‌ కేటరింగ్‌ కార్మికుడు. 


మా సిబ్బంది ముందే హెచ్చరించారు: మెరైన్‌ సీఐ

సముద్రంలోకి దిగొద్దని ఆ బాలురను తమ సిబ్బంది హెచ్చరించారని, దీంతో వారు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి సముద్రంలో లోతులోకి దిగారని మెరైన్‌ సీఐ సుబ్బారావు చెప్పారు. గల్లంతైన ముగ్గురి కోసం మెరైన్‌ సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లు గాలిస్తున్నారన్నారు.ప్రాణాలతో మిగిలిన ఇద్దరు చాలా సేపు గందరగోళంలో ఉండిపోయారని, ఆ తర్వాత తేరుకొని వివరాలు చెప్పారని వివరించారు. ఆ ముగ్గురు భయపడి ఎటైనా పారిపోయారేమోనన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. 


గోతులే బలిగొన్నాయి...

అలల ఉధృతికి సముద్రంలో గోతులు ఏర్పడుతున్నాయి. ఆ గోతులే యమపాశాలుగా మారుతున్నాయి. మోకాలి లోతు దాటి వెళితే ఆ గోతుల్లో పడి అలల దా టికి గల్లంతవుతున్నారు. సెలవురోజుల్లో గస్తీ పెంచితే ఇన్ని ప్రాణాలు పోయేవి కావని ప్రజలు అంటున్నారు.

Read more