బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు జగన్, కేసీఆర్ ఎందుకు కలవరు?
ABN , First Publish Date - 2022-03-05T08:12:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లు..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దేవరకొండ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్లు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం ఎందుకు కలిసి వెళ్లడంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వతరెడ్డి వర్ధంతి సభకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో కలిసి నడవడానికి తాము సిద్ధమని చెప్పారు. బీజేపీ మత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్ వ్యాపారానికి సన్నాహాలు జరిగాయని ఆరోపించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ముందుగా అప్రమత్తం చేసినట్లయితే అక్కడి మన విద్యార్థులను మన దేశానికి తీసుకువచ్చే అవకాశం ఉండేదన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వతరెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. 1962లో పెద్దవూర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన పర్వతరెడ్డి 1964లో అదనపు శిస్తు విధింపునకు వ్యతిరేకంగా 60 రోజులు జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి, శిస్తు తగ్గించేవరకూ పోరాటం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి గుర్తుచేశారు.