వ్యవసాయ విద్యలో సమూల మార్పులు

ABN , First Publish Date - 2022-03-05T08:12:22+05:30 IST

ప్రపంచవ్యాప్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆహారభద్రత, పోషణ లోపం, గ్రామీణ పేదరికాన్ని ..

వ్యవసాయ విద్యలో సమూల మార్పులు

 వ్యవసాయంలో డిజిటల్‌ సాంకేతికత 

 గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆకాంక్ష

 ఘనంగా అగ్రివర్సిటీ 51వ స్నాతకోత్సవం

 అశోక్‌ దళ్వాయికి గౌరవ డాక్టరేట్‌ 


తిరుపతి(విద్య), అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆహారభద్రత, పోషణ లోపం, గ్రామీణ పేదరికాన్ని పారదోలడానికి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయవిద్యలో సమూల మార్పులు తీసుకురావడం ఎంతో అవసరమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 51వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ వర్షాధారప్రాంత ప్రాధికారసంస్థ సీఈవో అశోక్‌ దళ్వాయికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. కులపతి హోదాలో స్నాతకోత్సవానికి వర్చువల్‌గా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతోపాటు వారి జీవనప్రమాణాలు పెంపొందించడం వ్యవసాయ వర్సిటీ విధుల్లో ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. జీవనోపాఽధి కోసం యువతకు అసాధారణ శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని వ్యవసాయ వృత్తిలో కొనసాగేలా ప్రేరేపించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆహార భద్రతపై పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా సాంకేతిక స్వీకరణ వేగవంతం కావాలన్నారు. భారతీయ వ్యవసాయంలో డిజిటల్‌ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్మార్ట్‌ టెక్నాలజీతో రైతులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉందన్నారు. పోషకాహార లోపం, గ్రామీణ పేదరిక నిర్మూలన క్రమంలో అంతర్జాతీయ డిమాండ్‌కు తగ్గట్టు ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ, వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలన్నారు. ఆహారశుద్ధి పరిశోధనలు తీవ్రతరం చేయాలన్నారు. స్ఫటిక బెల్లం రూపకల్పనకుగాను అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా స్థానానికి, నాగజెముడు జెల్లీ నుంచి పండ్ల తాండ్ర తయారీకి పులివెందులలోని ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, ఎస్వీయూకు పేటెంట్లు దక్కడం గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థులను గ్రామీణ ప్రాంతాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లాలని, తద్వారా వ్యవసాయసాగులో సమస్యలు, ఇతరత్రా కొత్త విషయాలు తెలుస్తాయని తెలిపారు. అనంతరం, 2017-18లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన 665మందికి కాన్వొకేషన్‌ డిగ్రీలను వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి అందజేశారు

Read more