హైకోర్టు విచారణకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

ABN , First Publish Date - 2022-03-05T08:08:27+05:30 IST

హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కేసులో వివరణ ఇచ్చేందుకు ఏసీబీ పూర్వ డీజీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ధర్మాసనం...

హైకోర్టు విచారణకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌

  చార్జిషీట్‌ దాఖలులో జాప్యంపై క్షమాపణలు 

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కేసులో వివరణ ఇచ్చేందుకు ఏసీబీ పూర్వ డీజీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ధర్మాసనం ముందు శుక్రవారం హాజరయ్యారు. కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు చేయడంలో జాప్యంపై క్షమాపణలు చెప్పారు. దిగువ స్థాయి అధికారుల అలసత్వం వల్ల జాప్యం జరిగిందని, ప్రస్తుతం కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేశామన్నారు. ఆ వివరాలతో సంతృప్తి చెందిన ధర్మాసనం కేసు తదుపరి విచారణకు హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. చార్జిషీట్‌తో పాటు ఇతర వివరాలను కోర్టులో దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ప్రకాశం జిల్లా, కొమరోలు ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్‌ సొసైటీపై వచ్చిన ఆరోపణలపై 2018లో నమోదైన కేసులో నాలుగేళ్లుగా చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పూర్తి రికార్డులతో కోర్టు ముందు హాజరుకావాలని ఏసీబీ పూర్వ డీజీని ఆదేశించింది. 

Updated Date - 2022-03-05T08:08:27+05:30 IST