కౌన్సెలింగ్‌ కష్టాలు!

ABN , First Publish Date - 2022-03-05T08:06:28+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు గతేడాది నవంబరులోనే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఐదు నెలలైనా ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. మరోపక్క కేంద్రం..

కౌన్సెలింగ్‌ కష్టాలు!

 హెల్త్‌ వర్సిటీలో తప్పుల తడకగా పీజీ కౌన్సెలింగ్‌

 తాజాగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు రెడీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌కు గతేడాది నవంబరులోనే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఐదు నెలలైనా ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. మరోపక్క కేంద్రం దేశవ్యాప్తంగా తన కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తిచేసింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రక్రియ పూర్తయింది. చివరికి తెలంగాణలో రెండేళ్ల క్రితం ఏర్పడిన కాళోజీరావు హెల్త్‌ యూనివర్సిటీ కూడా పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ను విజయవంతంగా ముగించింది. కానీ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో ఏపీ విద్యార్థులు అటు ఆలిండియా కోటా సీట్లు, ఇటు ఇతర రాష్ట్రాల్లో సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల ప్రకారం తొలుత ఆలిండియా కోటా సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ఏపీ నుంచి చాలామంది విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకుంటారు. అక్కడ సీట్లు కేటాయించి, జాయినింగ్‌ తేదీ ముగిసే లోపు ఏపీలో మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తికావాలి. అప్పుడు విద్యార్థులకు ఎక్కడ మంచి సీటు వస్తే అక్కడ జాయినయ్యే అవకాశం ఉంటుంది. పీజీలో పదుల సంఖ్యలో విభాగాలు ఉండడం వల్ల విద్యార్థులు తాము కోరుకున్న విభాగంలో సీటు వచ్చే వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే వారి ప్రయత్నాలకు హెల్త్‌ వర్సిటీ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఇప్పటికే నిర్వహించిన మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌ల్లో సీట్లు కేటాయించడం, మళ్లీ రద్దు చేయడంతో ఏపీ విద్యార్థుల్లో చాలామంది ఆలిండియా కోటా సీట్లు కోల్పోయారు. వర్సిటీ చరిత్రలో తొలిసారి పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ మొత్తం గందరగోళంగా తయారైంది. 


దెబ్బకొట్టిన సాఫ్ట్‌వేర్‌..

కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అత్యంత భద్రతతో కూడిన సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థను ఉపయోగిస్తోంది. కౌన్సెలింగ్‌, ఎగ్జామినేషన్‌, సర్టిఫికెట్ల జారీ.. ఇలా ప్రతి విషయంలో చాలా పటిష్ఠ వ్యవస్థను నిర్వహిస్తోంది. ఇప్పు డా వ్యవస్థ మొత్తం అవినీతి మయమైంది. అనుభవం లేని సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి కౌన్సెలింగ్‌ నిర్వహణ బాధ్యత లు అప్పగించడమే దీనికి కారణం. వర్సిటీ అధికారులు ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని.. దానికి తమ కౌన్సెలింగ్‌ ప్రక్రియను వివరించి తదనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రాయించుకుంటారు. వర్సిటీ అవసరాల మేరకు సదరు కంపెనీ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ బాధ్యతలు అప్పగించిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి కనీసం అనుభవం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019లో టెండర్లు ఆహ్వానించిన సమయంలో.. ప్రస్తుత కౌన్సెలింగ్‌కు సాఫ్ట్‌వేర్‌ సహకారం అందిస్తున్న కంపెనీనే ఎల్‌1గా వచ్చింది. ఆ కంపెనీ 2019 కౌన్సెలింగ్‌లో అనేక తప్పులు చేసింది. వెంటనే స్పందించిన వర్సిటీ అధికారులు ఆ కంపెనీని పక్కనపెట్టి.. ఎల్‌2 కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. 2021లో వర్సిటీ అధికారులు మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. 2019లో ఎల్‌1 వచ్చిన కంపెనీనే.. మళ్లీ టెండర్‌ దక్కించుకుంది. ఈ కంపెనీ ఎల్‌1గా నిలిచేందుకు వర్సిటీలోని కీలక అధికారి చేయాల్సిందంతా చేశారని తెలిసింది. వైసీపీలో ఒక ముఖ్య నేత ఒత్తిడితో, ఆ అధికారి అండందండలతో అనుభవంలేని సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఎంపికైంది. దీనికోసం వర్సిటీలోని కీలక అధికారి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు.. వర్సిటీ అధికారులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు తాజాగా రం గం సిద్ధం చేశారు. 3 రోజుల క్రితం మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసి.. ఈ నెల 7 వరకూ అభ్యర్థుల ఆప్షన్లకు అవకాశం కల్పించారు. పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ సందర్భం గా వెబ్‌సైట్‌లో దరఖాస్తు దగ్గర నుంచి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకునే వరకూ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు సాంకేతిక సమస్యలు తప్పకపోవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో ఇంకా మాప్‌ఆప్‌ రౌండ్‌ మిగిలే ఉంది. కేవలం పీజీ కౌన్సెలింగ్‌కే గందరగోళం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌.. ఇప్పుడు ఒకేసారి మాప్‌ఆప్‌ రౌండ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ల్లో ఇంకెంత గందరగోళం సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - 2022-03-05T08:06:28+05:30 IST