రైతులకు ప్లాట్లు.. సీఆర్‌డీఏకు పాట్లు!

ABN , First Publish Date - 2022-03-05T08:02:54+05:30 IST

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న చందాన సీఆర్‌డీఏ పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పుతో మూడు నెలల్లో రాజధాని రైతులకు ప్లాట్లను అందించటంతోపాటు, ..

రైతులకు ప్లాట్లు.. సీఆర్‌డీఏకు పాట్లు!

హైకోర్టు తీర్పుతో తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి.. మూడు నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందే

 యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిందే

 రెండున్నరేళ్లుగా పూర్తిగా పక్కనపెట్టేశారు

 ప్రభుత్వ ఒత్తిళ్లకు మూల్యం తప్పదా? 

 అధికారులకు కోర్టు ధిక్కరణ కేసుల భయం


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న చందాన సీఆర్‌డీఏ పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పుతో మూడు నెలల్లో రాజధాని రైతులకు ప్లాట్లను అందించటంతోపాటు, ఇచ్చినవి, ఇవ్వాల్సిన వాటిని కలిపి మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసి ఇవ్వాల్సి ఉంది. రాజధానిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయటం ఎంత ముఖ్యమో, అంతకంటే ముందుగా రైతుల ప్లాట్ల సంగతి మూడు నెలల్లోనే తేల్చాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో గత రెండున్నరేళ్లుగా సీఆర్‌డీఏ అధికారులు ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. జూన్‌ 2014లో రాష్ట్ర విభజన జరిగిన దరిమిలా ఆగస్టు నెలలో నూతన రాజధాని ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరులో క్యాపిటల్‌ సిటీ ఎక్కడ ఉంటుందో ఖరారు చేసింది. డిసెంబరులో ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించటంతో పాటు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.


ఆ మరుసటి ఏడాది 2015 మార్చి నాటికి మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల పరిధిలో రైతుల నుంచి 30వేల ఎకరాల భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో సమీకరించింది. అమరావతి రాజధాని 217.23 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. రాజధానిని 34 శాతం రెసిడెన్షియల్‌ ఏరియాగా, 11 శాతం కమర్షియల్‌గా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 30శాతం ఓపెన్‌ స్పేస్‌, 9శాతం వివిధ సంస్థలు, 13శాతం మేర మౌలిక సదుపాయాల కల్పన దిశగా క్యాపిటల్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఏప్రిల్‌లో రాజధాని పేరు అమరావతిగా ప్రకటించారు. మే నెలలో కాన్సెప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఆ తర్వాత ప్లాట్ల కేటాయింపునకు సంబంధించిన విధానంపై గ్రామస్థాయిలో సంప్రదింపులు జరిగాయి. అన్ని గ్రామాల్లో భూ యజమానులతో సీఆర్‌డీఏ అధికారులు  సమావేశాలు నిర్వహించారు.


రైతుల సలహాలు, సూచనలతో ప్లాట్ల కేటాయింపు విధానాన్ని చేపట్టారు. 2016 సెప్టెంబరు 21న శాఖమూరులో తొలి లాటరీ తీశారు. ఆ తర్వాత వరుసగా మిగిలిన ఎల్‌పీఎస్‌ లే అవుట్లలో లాటరీ తీశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 64,757 ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఇందులో 41,664 ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు పూర్తి చేశారు. మరో 792 ప్లాట్లు ప్రాసెసింగ్‌లో ఉండగా.. 23,093 ప్లాట్లకు రిజిస్ర్టేషన్‌ పెండింగ్‌లో ఉంది. 


రెండున్నరేళ్లుగా అడుగు ముందుకు పడలేదు

ఎల్పీఎ్‌స(ల్యాండ్‌ పూలింగ్‌ పథకం) లే అవుట్లలో రైతుల ప్లాట్లు, మౌలిక సదుపాయాల పరంగా అడుగు కూడా ముందుకు పడలేదు. రాజధానిలో రైతులకు పట్టా భూములకు సంబంధించి మెట్టభూమి అయితే రెసిడెన్షియల్‌ 1000 చదరపు గజాలు, కమర్షియల్‌ 200 చదరపు గజాలు, జరీబు భూములు అయితే రెసిడెన్షియల్‌ 1000 చదరపు గజాలు, కమర్షియల్‌ 300 చదరపు గజాలు, అసైన్డ్‌ భూముల కేటగిరిలో మెట్ట, జరీబు అయితే రెసిడెన్షియల్‌ 800 చదరపు గజాలు, కమర్షియిల్‌ 100, 200 చదరపు గజాల చొప్పున ప్లాట్లు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇవి కాకుండా పదేళ్ల వరకు మెట్ట భూములకు 30వేలు, జరీబు భూములుకు 50 వేల రూపాయలను కౌలుగా చెల్లిస్తామని తెలిపింది. పెన్షన్స్‌ కూడా ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో కౌలు సకాలంలో చెల్లించడం లేదు. ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వటం లేదు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, విద్యుత్‌  కనెక్షన్లు, వీధి దీపాల ఏర్పాట్లు చేయలేదు. అలాగే, రాజధాని ప్రాంతంలో చేపట్టవలసిన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, మిగిలిన అంతర్గత రోడ్ల పనులు కూడా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినవే తప్ప, ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. కొన్ని చోట్ల టీడీపీ అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాల ధ్వంసం కూడా కొనసాగుతోంది. అయితే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో మూడు నెలల్లో రైతులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్లాట్లను అప్పగించటంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాల్సి  ఉంటుంది.

Updated Date - 2022-03-05T08:02:54+05:30 IST