బిల్డ్ అమరావతే మా నినాదం
ABN , First Publish Date - 2022-03-05T07:50:28+05:30 IST
ఇప్పటివరకు సేవ్ అమరావతి దిశగా సాగించిన ఉద్యమాన్ని ఇకపై బిల్డ్ అమరావతి దిశగా ముందుకు తీసుకెళ్తామని అమరావతి రైతులు...
సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరు
808వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నేతలు
గుంటూరు/తిరుపతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు సేవ్ అమరావతి దిశగా సాగించిన ఉద్యమాన్ని ఇకపై బిల్డ్ అమరావతి దిశగా ముందుకు తీసుకెళ్తామని అమరావతి రైతులు ప్రకటించారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని నినాదంతో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారంతో 808వ రోజుకు చేరాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం జగన్ నోటి నుంచి ఏకైక రాజధాని అమరావతే అని స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తమ పోరు ఆగదని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో శుక్రవారం వివిధ పార్టీల నేతలు పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మందడంలోని రైతు శిబిరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం 808 రోజులుగా రాజధాని రైతులు, మహిళలు చేసిన ఉద్యమాన్ని రాష్ట్రం మర్చిపోదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం తరువాత ఆ స్థాయిలో ఉద్యమం చేశారని రైతులను కొనియాడారు. వ్యవసాయ చట్టాలపై దేశానికి ప్రధాని క్షమాపణ చెప్పారని.. అమరావతి రైతులకు సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పరని నిలదీశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించాలని జగన్‌కు సూచించారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ప్రసంగించారు.
శ్రీవారి దర్శనానికి అమరావతి జేఏసీ నేతలు
అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు శ్రీవారిని దర్శించుకునేందుకు శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తిరుమలేశుడిని దర్శించుకుని మొక్కు తీర్చుకునేందుకు వారు ఉదయం అలిపిరి వద్దకు చేరుకోగా వివిధ పార్టీల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరిన వారిద్దరూ సాయంత్రం 5.30గంటల కు కొండపైకి చేరుకున్నారు. అక్కడే బసచేసి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ‘‘న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఫలితం దక్కింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నాం. అమరావతి కోసం ప్రయత్నించిన ప్రజలందరికీ ధన్యవాదాలు’’ అని శివారెడ్డి అన్నారు. ‘‘151సీట్లతో అధికారంలోకి వచ్చినా రాజ్యాంగానికి లోబడి పాలన చేయాల్సిందే. లేకుంటే ఇలాంటి చెంపదెబ్బలే తినాల్సి ఉంటుంది’’ అని తిరుపతిరావు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 170కేసుల్లో ఓడిపోయిందన్నారు. వేరేవాళ్లయితే రాజీనామా చేసి వెళ్లిపోయేవారని ఆయన వ్యాఖ్యానించారు.