ఉపాధ్యాయ నేతలపై దాడి ఖాయం!

ABN , First Publish Date - 2022-03-05T07:39:31+05:30 IST

రానున్న రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలపై ప్రభుత్వ దాడి జరగడం ఖాయమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం...

ఉపాధ్యాయ నేతలపై దాడి ఖాయం!

ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి

‘చలో బెజవాడ’తో సర్కారు అహం దెబ్బతింది

రాబోయే రెండేళ్లూ సవాళ్లే

జగన్‌ స్వభావంలోనే ప్రజాస్వామ్యం లేదు 

నలుగురు నేతలు ముంచేసినా

కెరటం పడి లేచినట్లుగా పోరాడాలి

‘జస్టిస్‌ ఫర్‌ పీఆర్‌సీ’ దీక్షలో నేతలు


విజయవాడ, మార్చి 4 (ఆంధ్ర జ్యోతి): రానున్న రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలపై ప్రభుత్వ దాడి జరగడం ఖాయమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఎదురుదాడికి మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. రానున్న రెండేళ్లలో సవాళ్లు ఎదుర్కోక తప్పదని.. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఆందోళనలను సాగి స్తూ.. ప్రభుత్వాన్ని నిలువరించాలని పిలుపిచ్చారు. ‘జస్టిస్‌ ఫర్‌ పీఆర్‌సీ’ ఫోరం నేతృత్వంలో శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో ఏడుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు.. బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, షేక్‌ సాబ్జీ, కేఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ), వై.శ్రీనివాసులరెడ్డి, పాకలపాటి రఘువర్మ ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఇందులో ఫ్యాఫ్టో నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఉపాధ్యాయుల శక్తితోనే ‘చలో విజయవాడ’ ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. నాలుగు జేఏసీ నేతలకు వెన్నపూసగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్న సంగతిని గుర్తించిందని చెప్పారు. అయుతే దాని అహం దెబ్బతిని, దీర్ఘకాలిక అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలతో పాటు విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించేందుకు ప్రభుత్వానికంటే దూకుడుగా వెళ్తున్న అధికారులకు కూడా కళ్లెం వేయాల్సి ఉందన్నారు.


ఉపాధ్యాయుల ఉనికినే ప్రశ్నించే విధంగా అధికార వ్యవస్థ తయారైందని, ఇది అత్యంత ప్రమాదకరమని చెప్పారు. నూతన విద్యావిధానం జాతీయ స్థాయిలో ఎక్కడా జరగలేదని.. రాష్ట్రంలో మాత్రం వైఎ్‌సఆర్‌ విద్యావిధానం సాగుతోందని.. ఇందులోని సంస్కరణలను చూస్తే 20 వేల పాఠశాలలు మూతపడే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఉద్యమాలకు ఫుల్‌స్టా్‌పలు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలని లక్ష్మణరావు హితవు పలికారు. ఏ పార్టీ పిలుపునిస్తే ‘చలో విజయవాడ’ విజయవంతమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ స్వభావంలోనే ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. 


ఆ ఇద్దరూ జవాబివ్వలేక..

ఈ ముఖ్యమంత్రి సినిమా వాళ్లతో వారి సమస్యలపై మాట్లాడతారని, 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి మాత్రం వారితో మాట్లాడరని ఐవీ అన్నారు. ఏబీఎన్‌ చానల్లో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఇద్దరు జేఏసీ నేతలను రాధాకృష్ణ ఇరుకునపెట్టే అనేక ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు చెప్పలేని పరిస్థితి వారికి ఎదురైందని తెలిపారు. జేఏసీ నేతలుగా ఆ నలుగురూ ముంచేసినప్పటికీ..కెరటం పడిలేచినట్లుగా ఉపాధ్యాయ సంఘాలు పోరాడాలని స్పష్టంచేశారు. జగన్‌ సర్కారు  పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడుతోందని సాబ్జీ అన్నారు. ప్రతి అంశంపై హైకోర్టుకు వెళ్లడం, అక్కడ మొట్టికాయలు తినడం జరుగుతోందని.. పీఆర్‌సీ విషయంలో కూడా మొట్టికాయ వేయించుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, పెన్షనర్ల ఆకాంక్షలను మండలిలో ప్రస్తావిస్తామని శ్రీనివాసులురెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యమాల ద్వారానే అనుకున్నవన్నీ సాధించాల్సి ఉందని కత్తి తెలిపారు. ప్రభుత్వం ముందు బల ప్రదర్శనకు తాము దీక్ష చేపట్టలేదని.. ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల కోసమే చేపట్టామని రఘు వర్మ అన్నారు.


ప్రభుత్వ నిర్బంధం.. 

దీక్షకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. 50మందికే అనుమతి ఇస్తామని, రెండు గంటలే నిర్వహించాలని ఆంక్షలు పెట్టారు. ఈ దీక్షలో ఉపాధ్యాయులు పాల్గొనకుండా విద్యాశాఖాధికారులు ఒత్తిడితెచ్చారు.

Updated Date - 2022-03-05T07:39:31+05:30 IST