బాబాయ్‌పై అబ్బాయ్‌ కోపం!

ABN , First Publish Date - 2022-03-05T07:38:02+05:30 IST

‘వైఎస్‌ జగన్‌, బాబాయి వివేకానంద రెడ్డి మధ్య విభేదాలున్నాయి. వివేకాను వైసీపీలోకి తీసుకునేందుకు జగన్‌ తొలుత ఒప్పుకోలేదు..

బాబాయ్‌పై  అబ్బాయ్‌  కోపం!

వాళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయి

2004లోనే ఎంపీ టికెట్‌ కోసం జగన్‌ పట్టు 

వైఎస్‌ వద్దని వారించి వివేకాకు ఇచ్చారు

వైసీపీలో చేర్చుకోవడం జగన్‌కు ఇష్టంలేదు

చేరినా 2014లో వివేకాకు టికెట్‌ ఇవ్వలేదు

భారతికీ బంధువనే అవినాశ్‌తో సాన్నిహిత్యం

అందుకే... కడప ఎంపీ టికెట్‌ ఆయనకే

బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి వాంగ్మూలం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘వైఎస్‌ జగన్‌, బాబాయి వివేకానంద రెడ్డి మధ్య  విభేదాలున్నాయి. వివేకాను వైసీపీలోకి తీసుకునేందుకు జగన్‌ తొలుత ఒప్పుకోలేదు. అనేక ప్రయత్నాల తర్వాత 2012 డిసెంబరులో అంగీకారం తెలిపాకే వివేకా వైసీపీలో చేరారు. అయినా వారిద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి’’ అని వివేకా బావమరిది, అల్లుడి సోదరుడు ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆయన వివేకానంద రెడ్డికి బావమరిది కూడా! వివేకా కేసు దర్యాప్తులో భాగంగా శివప్రకాశ్‌ రెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. అందులో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. వివరాలు...


‘‘2004లో కాంగ్రెస్‌ పార్టీ వివేకాకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. అయితే, తనకే ఎంపీ టికెట్‌ ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ గట్టిగా పట్టుబట్టారు. అందుకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వివేకానంద రెడ్డికి టికెట్‌ ఇవ్వలేదు. 2009 సెప్టెంబరులో వైఎస్‌ మరణించారు. ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వివేకాను వ్యవసాయశాఖ మంత్రిని చేశారు. ఈ పరిణామం జగన్‌కు నచ్చలేదు. ఆ తర్వాత జగన్‌ కొత్త పార్టీ పెట్టారు. ఇది వివేకాకు నచ్చలేదు. అందుకే ఆయన జగన్‌ పార్టీలో చేరలేదు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మపై వివేకా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత... వైసీపీలో చేరాలని వివేకాకు నేను, వైఎస్‌ సుధీర్‌రెడ్డి సూచించాం. తొలుత ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు జగన్‌ ఇష్టపడలేదు. అనేక ప్రయత్నాల అనంతరం 2012 డిసెంబరులో వివేకా వైసీపీలో చేరారు. అయినా వివేకా,  జగన్‌ల మధ్య విభేదాలు ఉన్నాయి!


2014లో టికెట్‌ ఎందుకు ఇవ్వలేదంటే? 

2012లో వైఎస్‌ వివేకానందరెడ్డి వైసీపీలో చేరినప్పటికీ... 2014 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్‌ ఇవ్వలేదు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి జగన్‌ సతీమణి బాగా దగ్గరి బంధువు. (మేనమామ కూతురు).  అందుకే... అవినాశ్‌ రెడ్డికే ఎంపీ టికెట్‌ ఇచ్చారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి వివేకా పట్ల అనుకూలంగా లేరు. భాస్కరరెడ్డి కుటుంబంతో వివేకాకు సత్సంబంధాలు లేవు. వివేకా వైసీపీలో చేరడంపై కూడా వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఇది నేను గమనించాను. ఇక... 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వివేకాకు టికెట్‌ ఇవ్వడంపై అవినాశ్‌ రెడ్డి, భాస్కరరెడ్డి,  మనోహర్‌ రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఈ టికెట్‌ను శివశంకర్‌రెడ్డి ఆశించారు. వివేకా గెలిస్తే వైఎస్‌ జగన్‌ ఆయనకు అనుకూలంగా మారిపోతారని ఆ నలుగురూ భావించారు. ఇప్పటికే వివేకా కడపలో ప్రముఖ వ్యక్తి. అన్నీ ఆయన స్థాయిలోనే సెటిల్‌ అవుతాయి. వైసీపీలో వివేకా ప్రజాదరణ పొందడంపై వారు చాలా చిరాకుతో ఉన్నారు. వివేకా ఎమ్మెల్సీగా గెలిస్తే భవిష్యత్‌లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌కు గట్టిపోటీదారుడుగా తయారవుతారు. ఈ కారణాలతో వారు వివేకాపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి ఆ నలుగురు సహకరించలేదని నాతో వివేకా చెప్పారు. ఎర్ర గంగిరెడ్డి ఆయనకు వ్యతిరేకంగా వారితో కలవడం వివేకాను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.   


అవినాశ్‌రెడ్డి నా ఫోన్‌ ఎత్తలేదు... 

2019 మార్చి 14వ తేదీన నా మనవరాలి పుట్టినరోజు వేడుకలకు (వివేకా హత్యకు ఒకరోజు ముందు) ఎర్ర గంగిరెడ్డిని, రాజారెడ్డిని పిలిచాను. కానీ... ఆయన రాలేదు. గతంలో మా ఇంట్లో జరిగే ఏ వేడుకకైనా గంగిరెడ్డి కచ్చితంగా వచ్చేవారు. ఈసారి... కనీసం తాను రాలేకపోతున్నానని కూడా చెప్పలేదు. వివేకా  చనిపోయారని నాకు తెలిసిన వెంటనే  అవినాశ్‌ రెడ్డి, వైఎస్‌ రవీంద్రనాథ్‌ రెడ్డిలకు ఫోన్‌ చేసి అక్కడికి వెళ్లమని చెప్పాను. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు అవినాశ్‌ రెడ్డికి అనేకమార్లు ఫోన్‌చేసినా ఆయన స్పందించలేదు. ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌చేసి వివేకా చనిపోయారని చెప్పగానే ‘అట్లనా’ అన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన వివేకా చనిపోయారని చెబితే ఆయన సాదాసీదాగా స్పందించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత గంగిరెడ్డికి పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయనా స్పందించలేదు. వివేకా చనిపోయిన గదిని అవినాశ్‌రెడ్డి,  వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డిల సమక్షంలో గంగిరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలు శుభ్రం చేయించారని పలువురి ద్వారా తెలిసింది. 


మళ్లీ బెయిలు పిటిషన్‌ వేసిన ఉమా శంకర్‌ రెడ్డి

కడప లీగల్‌, మార్చి 4: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుల బెయిల్‌ పిటీషన్ల దాఖలు పర్వం  కొనసాగుతోంది. నాల్గవ అదనపు జిల్లా కోర్టులో సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ఒకరి తరువాత ఒకరు పిటిషన్లను వేస్తున్నారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ను డిసెంబరు 21న కోర్టు తోసిపుచ్చింది. గురువారం ఆయన మరోమారు బెయిలు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-05T07:38:02+05:30 IST