మొండిగా... ‘మూడు’కు!

ABN , First Publish Date - 2022-03-05T07:31:22+05:30 IST

ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరింద నుకుందాం! ఆ ఒప్పందం నుంచి ఏ ఒక్కరూ ఏకపక్షంగా వైదొలగలేరు. ఒకవేళ వెళ్లాలనుకుంటే... ‘..

మొండిగా... ‘మూడు’కు!

హైకోర్టు తీర్పుపై సర్కారు పెద్దల ధిక్కారం

సుప్రీంలో అప్పీలుతో ‘కాలయాపన వ్యూహం’?

‘అభివృద్ధి’పై రైతులను మభ్యపెట్టే యోచన

‘శాసనాధికారం’పై వక్రభాష్యంతో సిద్ధం

అసెంబ్లీ వేదికగా తప్పుదోవ పట్టించే యత్నం!

పార్లమెంటు చేసిన చట్టంలో ‘ఒకే రాజధాని’

దీనిపై రాష్ట్రానికి శాసనాధికారం లేదన్న హైకోర్టు

రైతులతో ఒప్పందం నుంచి తప్పుకోలేరని వెల్లడి

సుప్రీంకోర్టుకు వెళ్లినా పరాభవం తప్పదనే వ్యాఖ్యలు

మరి సర్కారు ఏం చేస్తుందన్నదే ప్రశ్న!


ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరింద నుకుందాం! ఆ ఒప్పందం నుంచి ఏ ఒక్కరూ ఏకపక్షంగా వైదొలగలేరు. ఒకవేళ వెళ్లాలనుకుంటే... ‘మరి నా సంగతేమిటి?’ అని అవతలి వ్యక్తి ప్రశ్నిస్తారు. కోర్టుల్లోనూ ఇదే వాదన నిలుస్తుంది, గెలుస్తుంది! వ్యక్తుల మధ్య ఒప్పందానికే ఇంత విలువ! మరి.. అమరావతి రైతులతో ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. అది ‘వెనక్కి తీసుకోలేని’ కాంట్రాక్టు!  ‘మీరు ఇచ్చిన భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తాం. దీనివల్ల మీకు ఇచ్చే ప్లాట్ల ధరలు భారీగా పెరుగుతాయి’... అనే చట్టబద్ధ హామీ! దీని నుంచి ప్రభుత్వం ఏకపక్షంగా తప్పుకోగలదా? కుదరనే కుదరదు అని హైకోర్టు స్పష్టంచేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఇదే తీర్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘రాజధానిగా అమరావతిని కొనసాగించాలి’... ఇది హైకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పు! మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అమరావతిపై ముందుకెళ్తుందా? లేక... మొండికేస్తుందా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ! ‘మూడు’ మారలేదని... పరిపాలన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు! మరోసారి అమరావతి రైతులను, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసగించేందుకు భారీ వ్యూహాలే రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు పలువురు వైసీపీ పెద్దల మాటలు... ‘తాడేపల్లి’లోజరుగుతున్న చర్చలు ఈ దిశగానే సాగుతున్నాయి. హైకోర్టు తీర్పు ప్రకారం... తక్షణం అమరావతి పనులు చేపట్టాల్సిందే. కానీ... దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ‘అక్కడ పిటిషన్‌ వేశాం’ అంటూ ఇక్కడ కాలయాపన చేసే అవకాశం కనిపిస్తోంది.


అదే సమయంలో... అసెంబ్లీలోనూ హైకోర్టు తీర్పుపై చర్చ జరుపుతామని సజ్జల ఇప్పటికే చెప్పారు. పార్లమెంటు చేసిన పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల మేరకు... అమరావతిని మార్చడం కుదరదని, దీనిపై రాష్ట్రానికి శాసనాధికారం లేదని హైకోర్టు తెలిపింది. అంతే  తప్ప... అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదని చెప్పలేదు. అయినప్పటికీ... కోర్టు తీర్పును వక్రీకరించే ప్రక్రియ మొదలైంది. ‘అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదంటారా? ఇదేం చోద్యం’ అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు... త్వరలో జరగబోయే అసెంబ్లీలోనూ ఏకపక్షంగా, తమకు తోచిన వాదనలను వినిపిస్తూ ప్రజలనూ తప్పుదారి పట్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 


రైతులను మభ్యపెట్టేలా...: అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునంతటినీ వదిలేసి రైతులకు మాత్రం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని మంత్రి  బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని రైతులను మభ్యపెట్టేలా, వారికి కేటాయించిన ప్లాట్లకు రోడ్డు వేసి ‘అభివృద్ధి చేశాం. రైతులకు న్యాయం జరిగింది’ అంటూ చేతులు దులుపుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశంలో డెవలప్‌ చేసిన ప్లాట్లు అంటే, ఇప్పటికే చంద్రబాబు హయాంలో వేసిన రహదారులకు మేకప్‌ చేయడం, అవసరమైన చోట తూతూమంత్రంగా రోడ్లు వేయడం... ఇదేనని భావిస్తున్నారు.


‘మూడు’ ముమ్మాటికీ కుదరదు!

అమరావతిపై హైకోర్టు 307 పేజీల తీర్పు ఇచ్చింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తేల్చి చెప్పింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పింది. ఒకటి... ఇప్పటికే పార్లమెంటు చట్టం ఉన్నందున దీనిపై కొత్తగా రాష్ట్రానికి శాసనాధికారం ఉండదు. రెండు... ‘మీరు భూములు ఇవ్వండి. వాటిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం. తద్వారా... మీకు ఇచ్చే ప్లాట్ల ధర పెరుగుతుంది. భారీ లబ్ధి జరుగుతుంది’ అని ప్రభుత్వం రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం చేసుకుంది. ఇది... ‘వెనక్కి తీసుకోలేని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ’! వైసీపీ పెద్దలు ఈ రెండో పాయింట్‌ వదిలేసి... ‘అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదంటారా’ అని హూంకరిస్తున్నారు. ఒకవేళ... రాష్ట్రానికి శాసనాధికారం ఉందనే అనుకుందాం! మరి... రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందం మాటేమిటి? ఇదీ అసలు ప్రశ్న. ఈ ‘కాంట్రాక్టు’ నుంచి ప్రభుత్వం ఏకపక్షంగా వైదొలగడం కుదరదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం... అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేయాల్సిందే. అంటే... రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందే! మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాల్సిందే. హైకోర్టు చెప్పింది కూడా ఇదే! అంతేకాదు... రాజ్యాంగానికీ, చట్టానికీ విరుద్ధంగా ఉంటే తప్ప గత ప్రభుత్వ విధానాలను మార్చడం కుదరదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. 


బడ్జెట్‌లో ‘అమరావతి’ ఉంటుందా?

త్వరలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ‘మూడు’ను చూస్తే... గవర్నర్‌ ప్రసంగంలోకానీ, బడ్జెట్‌ కేటాయింపుల్లోకానీ అమరావతి ప్రస్తావన ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. కేంద్రం అమరావతిలోని నిర్మాణాలకు విలువనిచ్చి... టోకెన్‌ ప్రొవిజన్స్‌ (నామమాత్రపు) కేటాయించింది. జగన్‌ సర్కారు మాత్రం ఆ పని చేసే అవకాశమే లేదని తెలుస్తోంది.

Updated Date - 2022-03-05T07:31:22+05:30 IST