ఏయూ వీసీని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-02-19T09:31:41+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రసాద్‌రెడ్డి వ్యవహారశైలిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు...

ఏయూ వీసీని బర్తరఫ్‌ చేయాలి

 రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతల డిమాండ్‌

 మార్చి 3న ‘చలో యూనివర్సిటీ’కి పిలుపు


విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రసాద్‌రెడ్డి వ్యవహారశైలిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వీసీని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం మార్చి 3న ‘చలో యూనివర్సిటీ’ కార్యక్రమం నిర్వహించాలని ‘ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్రజాస్వామిక విధానాలు, నిరంకుశ పాలన’కు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయాన్ని జొప్పించి వీసీ ప్రసాద్‌రెడ్డి దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఓ రాజకీయ పార్టీ కార్యాలయంగా వర్సిటీని మార్చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏయూ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. విశాఖకు సీఎం తీవ్రఅన్యాయం చేశారని, శారదా పీఠానికి వచ్చి మొక్కుకోవడం తప్ప... ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏయూ పాలకులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా గవర్నర్‌ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ మాట్లాడుతూ వర్సిటీలో అధికార, నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపించారు. ప్రొఫెసర్‌ కె.జాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోను కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T09:31:41+05:30 IST