అమల్లోకి జాతీయ డ్యాం భద్రత సంస్థ

ABN , First Publish Date - 2022-02-19T09:30:41+05:30 IST

డ్యాంల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల పర్యవేక్షణతోపాటు వాటికి సంబంధించిన అంతర్‌ రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం...

అమల్లోకి జాతీయ డ్యాం భద్రత సంస్థ

 చైర్మన్‌ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు

 అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపై దృష్టి

 విపత్తులు, డ్యాంల నిర్వహణ బాధ్యత కూడా


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: డ్యాంల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల పర్యవేక్షణతోపాటు వాటికి సంబంధించిన  అంతర్‌ రాష్ట్ర వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ డ్యాం అథారిటీ(జాతీయ డ్యాం భద్రతా సంస్థ) శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఓ గెజిట్‌ను విడుదల చేసింది. ఒక చైర్మన్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థ డ్యాంలకు సంబంధించిన విధి విధానాలు, సాంకేతిక అంశాలు, నియంత్రణ, విపత్తులు, నిర్వహణ, ఆర్థిక అంశాలు వంటివాటిపై  దృష్టిపెడుతుంది. ఒక రాష్ట్ర డ్యాం భద్రతను పర్యవేక్షించే వివిధ సంస్థల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడం, డ్యాం భద్రతను పర్యవేక్షించే సంస్థలకు, డ్యాంలో వాటాఉన్న ఇతర రాష్ట్రాలకు మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. డ్యాంల భద్రతకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఇరురాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతుంటా యి. కేరళ, తమిళనాడు మధ్య తలెత్తిన ముళ్లపెరియార్‌ డ్యాం వివాదమే దీనికి ఉదాహరణ. ఇటువంటి సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ జాతీయ డ్యాం భద్రత సంస్థ కృషి చేస్తుంది. ఈ సంస్థ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.  

Updated Date - 2022-02-19T09:30:41+05:30 IST