సీనియర్‌ జర్నలిస్టు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2022-02-09T08:32:40+05:30 IST

సీనియర్‌ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (80) ఇకలేరు....

సీనియర్‌ జర్నలిస్టు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ ఇకలేరు

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (80) ఇకలేరు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన నగరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీరంగనాథ్‌ 1942, జనవరి 7న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లెలో పుట్టారు. అమలాపురంలోని ‘శ్రీకోనసీమ భానోజీ కామర్స్‌ కళాశాల’లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితులయ్యారు. ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రప్రదేశ్‌ టైమ్స్‌’ తదితర తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా పనిచేశారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఒక హాస్టల్‌ భవనం కుప్పకూలిన ఉదంతంపై ఆయన రాసిన పరిశోధనాత్మక కథనంతో సంబంధిత శాఖ అధికారులంతా సస్పెండ్‌ అవడం ఆనాటి పాత్రికేయ లోకంలో ఒక సంచలనం. శ్రీరంగనాథ్‌ భార్య లక్ష్మీకాంతం విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు వంశీ డెక్కన్‌ క్రానికల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. శ్రీరంగనాథం చిన్న కుమార్తె అమెరికా నుంచి రావలసిఉన్నందున అంత్యక్రియలు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హఫీజ్‌పేట సైబర్‌వ్యాలీలోని స్వగృహంలో భౌతికకాయం ఉంచనున్నారు. శ్రీరంగనాథ్‌ హఠాన్మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏతో పాటు ఇతర జర్నలిస్టు సంఘాలు సంతాపం ప్రకటించాయి.

Read more