ఏపీహెచ్‌సీఏఏ ఎన్నికలు సత్వరమే జరపండి

ABN , First Publish Date - 2022-12-07T02:54:41+05:30 IST

ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గం ఎన్నికల విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది.

ఏపీహెచ్‌సీఏఏ ఎన్నికలు సత్వరమే జరపండి

సింగిల్‌ జడ్జి ఆదేశాలపై ధర్మాసనం స్టే

ప్రస్తుత కార్యవర్గమే ఎన్నికలు జరపాలని ఆదేశం

అమరావతి, డిసెంబర్‌ 6(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గం ఎన్నికల విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఏపీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యుడు కాని న్యాయవాదిని ఏపీహెచ్‌సీఏఏ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటు చేసిన అడ్‌హక్‌ కమిటీ సభ్యుడిగా నియమించడాన్ని తప్పుబట్టింది. ఏపీహెచ్‌సీఏఏ నుంచి తక్షణం బాధ్యతలు తీసుకోవాలని అడ్‌హక్‌ కమిటీని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. కాలపరిమితి ముగిసినా కార్యవర్గం కొనసాగడం మంచిది కాదని హితవు పలికింది. సాధ్యమైనంత త్వరలో ఏపీహెచ్‌సీఏఏ కార్యవర్గ ఎన్నికలు జరపాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణలో ఎన్నికల నిర్వహణకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. ఈ దశలో సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ... ఎన్నికల నిర్వహణకు ఏపీహెచ్‌సీఏఏ సిద్ధంగా ఉందని, త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో ధర్మాసనం విచారణను డిసెంబర్‌ 14కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ కార్యవర్గానికి కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎన్‌.విజయ్‌భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా బార్‌ కౌన్సిల్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఎన్నికల నిర్వహణకు సీనియర్‌ న్యాయవాదులతో అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ వివరాలు నమోదు చేసిన సింగిల్‌ జడ్జి తక్షణం అసోసియేషన్‌ నుంచి బాధ్యతలను తీసుకోవాలని అడ్‌హక్‌ కమిటీని ఆదేశిస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సింగిల్‌ జడ్జి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, కార్యదర్శి కె.నర్సిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీమోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీహెచ్‌సీఏఏ తన వాదనలు వినిపించుకొనేందుకు కూడా సింగిల్‌ జడ్జి అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రస్తుత అసోసియేషన్‌ కార్యవర్గం కాలపరిమితిని వచ్చే ఏడాది మర్చి వరకు పొడిగిస్తూ బార్‌ కౌన్సిల్‌ జనరల్‌ బాడీలో తీర్మానం చేసిందన్నారు.

అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ... ప్రస్తుత కార్యవర్గమే 2023 వరకు కొనసాగేందుకు జనరల్‌ బాడీలో తీర్మానం చేశాక అడ్‌హక్‌ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. విజయ్‌భాస్కర్‌ తరఫున న్యాయవాది సీతారాం చాపర్ల వాదనలు వినిపిస్తూ... బైలా ప్రకారం చైర్మన్‌ ఒక్కరే నిర్ణయం తీసుకున్నా సరిపోతుందన్నారు. కార్యవర్గం కాలపరిమితిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నిర్ణయం తీసుకోవచ్చని... జనరల్‌ బాడీ సమావేశంలోనే తీర్మానం చేశారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ తెలంగాణ బార్‌లో సభ్యుడిగా నమోదైన ఓ న్యాయవాది ఏపీ అడ్వకేట్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ బాడీ కార్యకలాపాలు నిర్వహించడం సరికాదని పేర్కొంది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుత కార్యవర్గానికి తేల్చి చెప్పింది.

Updated Date - 2022-12-07T02:54:42+05:30 IST