మహిళలకూ.. మొండిచేయి!

ABN , First Publish Date - 2022-08-13T08:44:57+05:30 IST

మహిళలకూ.. మొండిచేయి!

మహిళలకూ.. మొండిచేయి!

ఒక్క మహిళకూ పనులు ఇచ్చిన దాఖలాల్లేవు

సర్వీసు కాంట్రాక్టులూ దక్కని వైనం

చట్టాల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొత్త చట్టాలు తెచ్చామంటూ ప్రచారం చేసుకోవడం.. మేము మాత్రమే చేస్తున్నామంటూ ఆర్భాటం చేయడం.. ఆపై వాటిని అటకెక్కించడం.. ఇదీ చట్టాల అమల్లో జగన్‌ ప్రభుత్వ చిత్తశుద్ధి. రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సివిల్‌ కాంట్రాక్టు పనులు, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసింది. ఇటువంటి చట్టాన్ని తామే తెచ్చామని, మహిళల అభివృద్ధిపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని ఆర్భాటంగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంది. అయితే ఇంతవరకూ ఎక్కడా ఒక్క మహిళకు కూడా ఈ చట్ట ప్రకారం పనులు కల్పించిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో సివిల్‌ కాంట్రాక్టు పనులు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు, భవనాల నిర్మాణాల పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనులను ఎక్కడా ఒక్క మహిళా కాంట్రాక్టరుకు కూడా కల్పించిన దాఖాలాల్లేవు. దీంతోపాటు పలు శాఖలకు సంబంధించి సర్వీసు కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ మహిళల ఊసే లేదు. సంక్షేమ హాస్టళ్లకు ప్రొవిజన్లు, కూరగాయలు, గుడ్లు సరఫరా నుంచి కుకింగ్‌, మానవ వనరుల సరఫరా తదితర అనేక టెండర్లు ఇటీవల ప్రభుత్వం నిర్వహించింది. వాటికి సంబంధించి ఎక్కడా మహిళలకు ఈ పనులు కేటాయించలేదు. అసలు ఏ పనులూ నామినేషన్‌ కింద ఇచ్చిన సందర్భం లేదు. అసలు పనులే ఇవ్వనిదానికి అంత ఆర్భాటంగా చట్టాలెందుకని విమర్శలు వస్తున్నాయి.


అమలుకాని చట్టాలెన్నో..!

వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఏవో కొన్ని చట్టాలు చేసి గతంలో ఎవరూ చేయని చట్టాలను తామే చేశామని ఆర్భాటంగా ప్రకటించుకుంది. కార్పొరేషన్ల పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక చట్టం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇలా పలు చట్టాలు చేశారు. అయితే ఈ చట్టాలు ఏవీ ఆచరణలోకి వచ్చిన దాఖలాలు లేవు. నిధులు, విధులు లేని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వాటికి మాత్రం చైర్మన్లు, డైరెక్టర్ల పదవులిచ్చి హడావుడి చేశారు. మిగతా ఎక్కడా వాటి ఊసే లేదు. మరోవైపు పంచాయతీల సర్పంచ్‌లు గ్రామాల్లో నాటిన మొక్కల్లో 80 శాతం పరిరక్షించలేకపోతే చర్యలు తీసుకుంటామని ఏకంగా చట్టం తెచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల మొక్కలను గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నాటారు. మొక్కలు నాటడమే తప్ప వాటికి నీళ్లు పోసి సంరక్షించడంపై దృష్టిపెట్టకపోవడంతో లక్షలాది మొక్కలు చనిపోయాయి. అయితే ఎక్కడా ఒక్క సర్పంచ్‌పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. తెలంగాణలో జరిగిన సంఘటన ఆధారంగా అక్కడ చట్టం చేయకపోయినా మన అసెంబ్లీలో దిశ చట్టం తెచ్చారు. 20 రోజుల్లో దోషిని తేల్చి శిక్షలు వేస్తామని ఆర్భాటం చేశారు. ఈ చట్టాన్ని కేంద్రానికి పంపిస్తే తిరుగు టపాలో వచ్చింది. చట్టం అమలులో లేకపోయినా దిశ పోలీసుస్టేషన్లు ప్రారంభించారు. లేని చట్టం ఉందంటూ దిశ యాప్‌పై విస్తృతమైన ప్రచారం ప్రారంభించారు. లేని చట్టాలకు ఆర్భాటంగా ప్రచారం చేయడం, ఉన్న చట్టం అమలు చేసే అవకాశం ఉన్నా వాటి ఊసే ఎత్తకపోవడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. చట్టసభల్లో బలం ఉందికదా అని ప్రతిదీ చట్టం చేయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

Updated Date - 2022-08-13T08:44:57+05:30 IST