ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు పెట్టలేదు?

ABN , First Publish Date - 2022-08-13T08:26:07+05:30 IST

ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు పెట్టలేదు?

ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు పెట్టలేదు?

‘డర్టీ వీడియో’పై గవర్నర్‌ హరిచందన్‌ ఆరా!

పరిశీలన జరిపి తప్పక న్యాయం చేస్తా

మహిళా జేఏసీ ప్రతినిధులకు హామీ 


విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): డర్టీ వీడియోలో కనిపించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ హరిచందన్‌ను మహిళా ప్రతినిధులు కోరారు. ఆ వీడియోను ఆయన సమక్షంలో వారు ప్రదర్శించగా... ఎంపీ గురించి గవర్నర్‌ లోతుగా ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ ప్రతినిధులు చెన్నుపాటి కీర్తి, సుంకర పద్మశ్రీ, వంగలపూడి అనిత, దుర్గాభవానీ, గంగాభవానీ, రావి సౌజన్య, రమాదేవి తదితరులు రాజ్‌భవన్‌లో హరిచందన్‌ను కలిశారు. వాస్తవానికి శనివారం సాయంత్రం 5.30గంటలకు గవర్నర్‌ కార్యాలయం అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసింది. దానిని ఒకరోజు ముందుకు మార్చారు. గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లగానే ఆయన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తి వివరించారు. ప్రతి అంశంపైనా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ మాధవ్‌ అసభ్యకర వీడియో అంశం ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి ఆ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెబితే, అనంతపురం ఎస్పీ అది ఒరిజినల్‌ వీడియో కాదని, తాము ఏ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపలేదని చెబుతుండటాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పోలీసుగా పనిచేసిన ఎంపీని ఎస్పీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది కొత్త కాదని, ఇంతకుముందు అవంతి శ్రీనివాస్‌, అంబటి రాంబాబుకు సంబంధించిన రాసలీలల ఆడియోలు లీకయ్యాయని తెలిపారు. వాటి విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. పైగా అంబటి రాంబాబుకు మంత్రిగా పదోన్నతి కల్పించిందన్నారు. మహిళలంతా రక్షాబంధన్‌ను రక్షణగా భావిస్తారని, అదేరోజున తమ రక్షణ కోసం వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మాధవ్‌ వీడియో కారణంగా మహిళల ఆత్మగౌరవానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. తాను కచ్చితంగా ఈ అంశంపై పరిశీలన చేసి న్యాయం చేస్తానని గవర్నర్‌ భరోసా ఇచ్చారు. ఇది తన కర్తవ్యమని మహిళలకు ధైర్యం చెప్పారు. అనంతరం మహిళలంతా కలిసి గవర్నర్‌కు రాఖీ కట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘వీడియో విషయం తెలుసుకుని గవర్నర్‌ ఆశ్చర్యపోయారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎంతో అనుభవం ఉన్న అధికారి. ఆయనకు టెలీ కమ్యూనికేషన్స్‌పై మంచిపట్టు ఉంది. అటువంటి అధికారి సైతం సీఎంకు భయపడి.... ఆ వీడియో ఒరిజినల్‌ కాదంటున్నారు. ఒరిజినల్‌ వీడియో దొరకపోతే మాధవ్‌ నిర్దోషి అని భావించాలా? దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తాం.’’ అని అనిత హెచ్చరించారు. 

వీడియోపై ప్రశ్నించిన మహిళలను మాధవ్‌ తిడుతున్నారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. చేసిన తప్పునకు చింతించాల్సింది పోయి ఎంపీ మాధవ్‌ బరి తెగించి మాట్లాడుతున్నారని రావి సౌజన్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గవర్నరు: ఈజ్‌ ఇట్‌ న్యూడ్‌ వీడియో?

మహిళలు: ఎస్‌. ఇట్‌ ఈజ్‌ రియల్‌ న్యూడ్‌ వీడియో

గవర్నరు: హూ ఈజ్‌ ద పర్సన్‌?

మహిళలు: హీ ఈజ్‌ ఏ ఎంపీ

గవర్నరు: వాట్స్‌ ద నేమ్‌

మహిళలు: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌

గవర్నరు: వై ద ఎఫ్‌ఐఆర్‌ ఈజ్‌ నాట్‌ రిజిస్టర్డ్‌?

మహిళలు: ప్రభుత్వమే తాత్సారం చేస్తోంది.

గవర్నరు: వై నోబడీ ఈజ్‌ నాట్‌ కంప్లైయింటెడ్‌?

మహిళలు: వీడియోలో ఉన్న మహిళ ఉందో లేదో తెలియదు. ఆమెను బయటకు రాకుండా ప్రభుత్వం బెదిరిస్తోంది.

.......డర్టీ వీఢియో వ్యవహారంపై గవర్నరు హరిచందన్‌కు, డిగ్నిటీ ఫర్‌ ఉమన్‌ జేఏసీ ప్రతినిధులకు మధ్య జరిగిన సంభాషణ ఇది...

Updated Date - 2022-08-13T08:26:07+05:30 IST