కోతలు కోసి వాతలు

ABN , First Publish Date - 2022-05-22T08:59:41+05:30 IST

కోతలు కోసి వాతలు

కోతలు కోసి వాతలు

విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం వంచన

పెళ్లికానుకగా 1.50 లక్షలు ఇస్తామని గొప్పలు

2019 సెప్టెంబరులో ఉత్తర్వులు కూడా జారీ

ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా ఇవ్వని వైనం 

గతంలోని స్వయం ఉపాధి రాయితీలూ బంద్‌ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నో హామీలు ఇచ్చిం ది. ఆచరణలో మాత్రం హామీలు గాలికిపోయాయి. బాధితుల్లో ఉద్యోగులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు. జగనన్న సర్కారు చివరకు విభిన్న ప్రతిభావంతులను కూడా వంచించింది. వారికి ప్రోత్సాహక కానుకలను బంద్‌ చేసింది. స్వయం ఉపాధి రాయితీలకూ మంగళం పాడేసింది. వైసీపీ సర్కారు మూడేళ్ల నుంచి తమ సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవని విభిన్న ప్రతిభావంతులు వాపోతున్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమానికి పెద్ద పీట అంటూ కాగితాలు, బడ్జెట్‌లో నిధులు కేటాయించడం తప్ప.. ఆచరణలో శూన్యమని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వారికి గత ప్రభుత్వాల హయాంలో పలు పథకాలు అందేవి. వైసీపీ సర్కారు వచ్చాక వాటి ఊసు లేదు. 


అసలుకే ఎసరు 

ఎన్టీఆర్‌ హయాంలో విభిన్న ప్రతిభావంతులకు వివాహ ప్రోత్సాహక బహుమతిని ప్రవేశపెట్టారు. పెళ్లికానుకగా రూ.3 వేలు ఇచ్చేవారు. ఆ ప్రోత్సాహకం సరిపోదని భావించి ఎన్టీఆర్‌ హయాంలోనే రూ.10 వేలకు పెంచారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుకను రూ.50 వేలకు పెంచారు. 2014లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక.. విభిన్న ప్రతిభావంతుల విజ్ఞప్తి మేరకు పెళ్లి ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 1.50 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2019 సెప్టెంబరు 16న ఆర్భాటంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు వివాహం చేసుకున్న ఏ ఒక్క విభిన్న ప్రతిభావంతులకూ పెళ్లికానుక అందిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు ఇచ్చేవారని, అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అసలుకే మోసం చేసిందని వైసీపీ సర్కారుపై వారు  మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా దాదాపు 200 మంది విభిన్న ప్రతిభావంతులు వివాహాలు చేసుకుంటారని, మూడేళ్లుగా ఒక్కరికీ పెళ్లికానుక అందలేదని వాపోతున్నారు. ప్రభుత్వ సాయం కేవలం జీవోకు పరిమితమైందని విమర్శిస్తున్నారు. 


స్వయం ఉపాధి సహాయం సున్నా

విభిన్న ప్రతిభావంతుల స్వయం ఉపాధి రాయితీలకూ వైసీపీ సర్కారు గండి కొట్టింది. వారి కోసం బడ్జెట్‌లో రూ.40 కోట్లు, రూ.50 కోట్లు కేటాయించి, ఆ తర్వాత కాగితాలకే పరిమితం చేస్తోంది. విభిన్న ప్రతిభావంతులు తమ కాళ్లపై తాము నిలబడడానికి, వారిలో మానసిక స్థైర్యం నింపడానికి గత ప్రభుత్వంలో  కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాలు ఇచ్చేవారు. వీటితో పాటు ట్రై సైకిళ్లు, మూడు చక్రాల మోటారు వాహనాలు ఇచ్చేవారు. ఇవి వారికి ఎంతో ఉపయోగపడేవి. టీ, కాఫీ, టిఫిన్ల అమ్మకాలు వంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ రాయితీ రుణాల ఊసేలేదు. ఒక్క ట్రై సైకిల్‌ కానీ, మోటారు వాహనాలు కానీ కొనుగోలు చేసి అందించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన వాహనాలనే ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని చెబుతున్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడంతో కొన్ని చోట్ల తుప్పు పట్టిపోతున్నాయి. విభిన్న ప్రతిభావంతులకు లబ్ధి కలగకపోగా, ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది. 

గత ప్రభుత్వంలో పింఛన్‌ పెంపు: 2014కు ముందు విభిన్న ప్రతిభావంతులకు రూ.500 పెన్షన్‌ ఇచ్చేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భారీగా పెంచారు. 80 శాతం లోపు వైకల్యం ఉన్న వారికి రూ.1000.. 80 శాతం పైన వైకల్యం ఉన్న వారికి రూ.1500కు పెంచారు. ఆ తర్వాత పెరిగిన ధరలకు అనుగుణంగా పింఛన్‌ను రూ.3 వేలకు పెంచారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్‌ రూ.3 వేలే ఇస్తోంది. అంతకు మించి రూపాయి పెంచలేదు.


గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ నుంచీ నిధులు

టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా కూడా నిధులు కేటాయించేవారు. విభిన్న ప్రతిభావంతులు తమ సమస్యలు తెలుపుతూ దరఖాస్తు చేసుకుంటే వారికి రూ.50 వేలు నుంచి లక్ష వరకు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక వారికి సీఎంను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 


బడ్జెట్‌ కేటాయింపులు జీతాలకే సరి 

విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల కోసమంటూ 2022-23 బడ్జెట్‌లో జగన్‌ సర్కార్‌ రూ.82 కోట్లు ప్రతిపాధించింది. ఇందులో రూ.12 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులుగా తెలిపింది. ఈ మొత్తం కేటాయింపుల్లో  రెవెన్యూ వ్యయం కింద రూ.79 కోట్లు చూపించింది. ఈ నిధుల్లో చాలా వరకు ఉద్యోగుల జీతాలకే సరిపోతాయని విభిన్న ప్రతిభావంతులు చెబుతున్నారు. పేరుకే కేటాయింపులు చేస్తున్నారని, తమకు సంక్షేమ ఫలాలు అందడం లేదని వాపోతున్నారు. 


ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది

వివిధ వర్గాల ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో, అలాగే విభిన్న ప్రతిభావంతులను కూడా వదిలిపెట్టలేదు. స్వయం ఉపాధిలో రాయితీతో కూడి రుణాలు ఇవ్వడం లేదు. పెళ్లి కానుక ఇవ్వడంలేదు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఈ పథకాలన్నింటినీ అందించాలి. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ పెంచాలి. 

- విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయక సంస్థ మాజీ చైర్మన్‌ కోటేశ్వరరావు టీడీపీ హయాంలో విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు)కు పెళ్లి ప్రోత్సాహక కానుకగా రూ.లక్ష ఇచ్చేవారు. జగనన్న సర్కార్‌ వచ్చాక ఆర్భాటంగా దాన్ని 1.50 లక్షలకు పెంచింది. 2019 సెప్టెంబరులో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతే.. ఆ తర్వాత ఒక్కరికి కూడా పెళ్లికానుక అందించిన దాఖలాలు లేవు. అంతేగాక, గతంలో ఉన్న స్వయం ఉపాధి రాయితీలనూ బంద్‌ చేసింది. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఇదీ.  

Read more