డిస్కమ్‌లను రక్షించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-28T09:45:55+05:30 IST

డిస్కమ్‌లను రక్షించుకోవాలి

డిస్కమ్‌లను రక్షించుకోవాలి

వాటి మనుగడ కాపాడేలా విద్యుత్‌ టారిఫ్‌లు

వినియోగదారులనూ దృష్టిలో ఉంచుకుంటాం

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి


విశాఖపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటివని, ప్రైవేటు చేతికి వెళ్లకుండా వాటిని సంరక్షించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి వ్యాఖ్యానించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్‌ టారి్‌ఫలపై విశాఖపట్నం నుంచి వర్చువల్‌ విధానంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్కమ్‌లు ప్రైవేటుపరమైతే జరిగే పరిణామాలు ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి, వాటి మనుగడకు భంగం కలగకుండా మరోవైపు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా టారి్‌ఫలు నిర్ణయించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దీనిపై సుదీర్ఘంగా, లోతుగా అధ్యయనం చేసి ధరలు ఖరారు చేస్తామని చెప్పారు. 24/7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని, ఈ సమస్యపై ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం అభినందనీయమన్నారు. ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డిస్కమ్‌లు రూ.82 వేల కోట్ల పైబడి స్థిర చార్జీల అప్పులు, రూ.26,961 కోట్ల నష్టాలతో సతమతమవుతున్నాయన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేశామని, త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ చేపడతామన్నారు. సోలార్‌ పంపుసెట్లకు సర్వీసింగ్‌ చేసే బాధ్యతను తీసుకుంటామని ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతో్‌షకుమార్‌ చెప్పారు. విలీనమైన రెస్కోలలో పాత తేదీలతో చెక్కులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ చేసి తగిన చర్యలు చేపడతామన్నారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసమే డెవల్‌పమెంట్‌ చార్జీలు వసూలు చేస్తున్నామని సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్దనరెడ్డి చెప్పారు. వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమేనని అన్నారు.

Read more