యాక్టివ్‌ కేసులు 73,143

ABN , First Publish Date - 2022-01-23T09:10:59+05:30 IST

యాక్టివ్‌ కేసులు 73,143

యాక్టివ్‌ కేసులు 73,143

మరో 2రోజుల్లో లక్ష దాటే అవకాశం

కొత్తగా 12,926 పాజిటివ్‌లు నమోదు


అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు అమాంతం పెరిగిపోయాయి. రోజూ పది వేలకు పైగా కొత్త కేసులు వస్తుండటం, దానికి తగినట్లు డిశ్చార్జిలు లేకపోవడంతో వీటి సంఖ్య పైపైకి పోతోంది. శనివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,143కి చేరింది. మరో రెండు, మూడు రోజుల్లో ఇది లక్షకు చేరే అవకాశం ఉందని అంచనా. గతేడాది ఈ సంఖ్య లక్ష దాటడానికి వారాలు పట్టగా ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఆ స్థాయికి కేసులు చేరుతుండంటపై ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24గంటల్లో 43,763 మందికి పరీక్షలు నిర్వహించగా 12,926 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అత్యధికంగా విశాఖలో 1,959 కేసులు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరులో 1,566, అనంతపురం 1,379, గుంటూరు 1,212, ప్రకాశం 1,001, కర్నూలులో 969 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు 14,538కి పెరిగాయి. కాగా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి కరోనా సోకింది. తనకు పాజిటివ్‌ వచ్చిందని, ఇటీవల తనను కలసినవారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మంత్రి వెల్లడించారు. 


తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం 

తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడి క్యాంప్‌సలో ఉన్న విద్యార్థుల్లో వారం క్రితం ఓ విద్యార్థికి కరోనా సోకింది. మిగిలిన వారికి శనివారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 40మంది విద్యార్థులతో పాటు పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. క్యాంప్‌సలో ఎక్కువ గదులుండటంతో వారిని ఐసొలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని ఐఐటీ సిబ్బంది చెబుతున్నారు. ఫ్యాకల్టీలో ఎవరికీ పాజిటివ్‌ లేదన్నారు. మార్చి వరకు ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగుతాయని చెప్పారు.

Updated Date - 2022-01-23T09:10:59+05:30 IST