ఉద్యోగులపై వైసీపీ దుష్ప్రచారం

ABN , First Publish Date - 2022-01-23T08:42:41+05:30 IST

ఉద్యోగులపై వైసీపీ దుష్ప్రచారం

ఉద్యోగులపై వైసీపీ దుష్ప్రచారం

వచ్చే డబ్బంతా జీతాలకేనని మంత్రుల ప్రచారం

ఈ ప్రభుత్వంలో నిత్యం ప్రజలపై బాదుడు: పట్టాభి


అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం డబ్బంతా ఉద్యోగులకే ఖర్చయిపోతోందని స్వయంగా మంత్రులు ప్రచారం చేస్తూ, ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమాచార మంత్రి పేర్ని నాని దుష్ప్రచార మంత్రి మాదిరిగా తయారయ్యారని విమర్శించారు.   ప్రభుత్వ ఆదాయం 100 రూపాయలు ఉంటే, ఉద్యోగుల జీత భత్యాలకు 110 రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పారని, ఇది పచ్చి అబద్ధమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వచ్చిన డబ్బులో పాతిక శాతం మాత్రమే ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చయ్యాయని తెలిపారు. ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత నవంబరు వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చిన ఆదాయం రూ.3.16 లక్షల కోట్లు. తెచ్చుకొన్న అప్పులు మరో రూ.3 లక్షల కోట్లు. ఈ రెండూ కలిపితే దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో గత నవంబరు వరకూ ఉద్యోగుల జీతభత్యాలకు చేసిన ఖర్చు రూ.1.5 లక్షల కోట్లు. అంటే పాతిక శాతం. 110 శాతం జీతభత్యాలకు ఖర్చు చేశామని మంత్రి చెప్పింది అబద్ధం’’ అని ఆయన చెప్పారు. పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల భారం పడుతోందని మంత్రులు గగ్గోలు పెడుతున్నారని, 2014లో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై రూ.15 వేల కోట్ల భారం పడిందన్నారు. ఇప్పుడు వస్తున్న ఆదాయంలో సగం కూడా విభజన సమయంలో రాష్ట్రానికి లేదని తెలిపారు. 

Read more