పాదయాత్రతో పండగొచ్చింది

ABN , First Publish Date - 2022-09-30T09:13:59+05:30 IST

పాదయాత్రతో పండగొచ్చింది

పాదయాత్రతో  పండగొచ్చింది

పశ్చిమలో కిక్కిరిసిన పల్లె రహదారులు 

తరలివచ్చిన రైతులు, యువత 

నృత్యాలతో సంఘీభావం తెలిపిన చిన్నారులు 

100 గుమ్మడికాయలతో దిష్టితీసిన మహిళలు

రెండున్నర గంటలపాటు జోరువర్షంలోనే నడక 

18వ రోజున 16కిలోమీటర్ల మేర యాత్ర 

వైసీపీ కవ్వింపులు, పోటీ ఫ్లెక్సీల ఏర్పాటు


ఏలూరు/దెందులూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఒకవైపు మండుటెండ.. ఇంకోవైపు పెనుగాలులు, జోరువాన.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో గురువారం ఉదయం మాజీ ఎమెల్యే చింతమనేని ప్రభాకర్‌ సూర్య రథం ఎదుట పూజలు చేసి పాదయాత్రను ఆరంభించారు. మహిళలు భారీగా తరలివచ్చి రైతులకు తిలకాలు దిద్దారు. భారీగా విరాళాలు ప్రకటించారు. వీరితో పాటు పెద్దసంఖ్యలో చిన్నారులు వివిధ వేషధారణలతో నృత్యాలు చేసి మద్దతు ప్రకటించారు. అమరావతి మనదేనంటూ చిన్నారులు కదం తొక్కడం యాత్రకు సరికొత్త శోభనిచ్చింది. పాదయాత్ర 18వ రోజున కొవ్వలి నుంచి పెరుగుగూడెం వరకు దాదాపు 16 కిలోమీటర్లు నడక సాగింది. రైతులు, యువత, భారీగా తరలిరావడంతో పల్లె మార్గాలన్నీ కిక్కిరిశాయి. దెందులూరులో వందలాది మంది రైతులు, స్థానికులు ఎదురేగి భారీ స్వాగతం పలికారు. పాదయాత్రికులపై పూలవర్షం కురిపించారు. ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు.  మహిళలు వంద గుమ్మడికాయలను దిష్టి తీశారు. పాదయాత్ర సాగిన ఏడు గ్రామాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. కొవ్వలి, రామారావుగూడెం మధ్య కాలు కదపడానికి వీల్లేనంత మంది జనంతో రహదారులన్నీ నిండాయి. చింతమనేని ప్రభాకర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు టీడీపీ కన్వీనర్‌ బడేటి చంటి, మాజీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. 


రామారావుగూడెంలో స్వల్ప ఉద్రిక్తత

రామారావుగూడెంలో వైసీపీ మద్దతుదారులు కొందరు ‘జై జగన్‌.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనికి ప్రతిగా ‘జై అమరావతి’ అంటూ ఇంకొందరు నినాదాలతో హోరెత్తించారు. ఇదే గ్రామంలో ‘మూడు రాజధానులే ముద్దు’ అంటూ వైసీపీ అనుకూలురు ఫ్లెక్సీలు పెట్టారు. ఇరువర్గాలు రెచ్చిపోకుండా పోలీసులు పాదయాత్ర ముందుకు సాగేలా చర్యలు తీసుకున్నారు. 


గాలి, వానలోనూ నడక 

రామారావుగూడెంలో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాస్తంత విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత యాత్ర ప్రారంభించిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పెనుగాలులు, జోరు వాన ఆరంభమైంది. తాము రాత్రి బస చేసే ప్రాంతం వరకు దాదాపు ఐదు కిలోమీటర్లు నిడివినా వర్షం కురుస్తుండగా తడిసి ముద్దయినా ఎక్కడా ఆగలేదు. గొడుగుల సాయంతో మహిళా రైతులంతా ముందుకు సాగగా మిగతావారు అనుసరించారు. రెండున్నర గంటలపాటు వర్షంలోనే పాదయాత్ర కొనసాగింది. స్థానికులు గొడుగులు ధరించి మరీ వచ్చి వారికి స్వాగతం పలికారు. పెరుగుగూడెంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వస్తే కాళ్లు నరుకుతామని బెదిరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ రోజు పాదయాత్రపై గుడ్లు, రాళ్లు వేయడానికి విఫలయత్నం చేశారన్నారు. దానిని అడ్డుకున్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. 


పెయిడ్‌ ఆర్టి్‌స్టలతో రైతు యాత్ర: మంత్రి రోజా

యలమంచిలి, సెప్టెంబరు 29: తమ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి పలువురు టీడీపీ నాయకులు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టి యాత్రు చేయిస్తున్నారని పర్యాటక మంత్రి ఆర్‌.కె. రోజా విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో గురువారం నిర్వహించిన మూడో విడత వైఎస్సార్‌ చేయూత చెక్కుల పంపిణీలో రోజా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్న పలువురి చేతుల్లో యాపిల్‌ ఫోన్లు ఉంటున్నాయన్నారు. ఇలాంటి వారు సాధారణ రైతులా అనే సందేహం కలుగుతుందన్నారు. 

Read more