నేడు, రేపు భారీవర్షాలు

ABN , First Publish Date - 2022-09-30T09:10:21+05:30 IST

నేడు, రేపు భారీవర్షాలు

నేడు, రేపు భారీవర్షాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, రాయలసీమల్లోని అనేకచోట్ల గురువారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రెండు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఇంకా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా వాతావరణ అనిశ్చితి తీవ్రత ఎక్కువగా వున్నందున పిడుగులు, మెరుపులు సంభవించే సమయంలో ఆరుబయట వుండకూడదని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లాలి తప్ప చెట్లు, ఆరుబయట ఉండొద్దని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-30T09:10:21+05:30 IST