వర్సిటీ ఉద్యోగులకు సంకటం

ABN , First Publish Date - 2022-12-30T03:41:31+05:30 IST

విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతోంది. పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్లకు పెంచుతామని ....

వర్సిటీ ఉద్యోగులకు సంకటం

వారితో ఆడుకుంటున్న జగన్‌ ప్రభుత్వం

పదవీవిరమణ 62 ఏళ్లు చేస్తామంటూ హామీ

ఏడాది గడుస్తున్నా జారీ కాని ఉత్తర్వులు

ఇప్పటికే రిటైర్‌ అయిన 200 మంది ఉద్యోగులు

పొడిగింపు ఆశతో పెన్షన్ల జోలికెళ్లని వైనం

రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న మరో 40 మంది

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతోంది. పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్లకు పెంచుతామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏడాది కాలంగా జీవో విడుదలపై తాత్సారం చేస్తోంది. ఎప్పటికప్పుడు జీవో ఇస్తామని అధికారులు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని ఊగిసలాటతో వందలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

హామీ ఇచ్చి ఏడు నెలలయింది

పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ పొడిగింపు వర్తింపజేయాలని ఎయిడెడ్‌ విద్యా సంస్థల, యూనివర్సిటీల గురుకులాల ఉద్యోగులు కోరారు. వారు అడిగిందే తడవుగా ఈ ఏడాది మేలో ఉద్యోగులకు అధికారులు హామీ ఇచ్చారు. బొత్స విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్టోబరులో ఇదే హామీని మళ్లీ ఇచ్చారు. ఇటీవల యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ పెంపునకు నిర్ణయం అయిపోయిందని ప్రకటించారు. మంత్రి తాజా ప్రకటనతో జీవో వస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ రోజులు గడిచిపోతున్నా ప్రభుత్వంలో దీనిపై ఎలాంటి స్పందన కనిపించడం లేదు. జనవరి 2022 నుంచి నవంబరు వరకూ వివిధ యూనివర్శిటీల్లో సుమారు 200 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. డిసెంబరు, జనవరి నాటికి అది 300కు చేరుతుందని అంచనా. అధికారుల హామీ మేరకు సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు వస్తాయన్న ఆశతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఇంతవరకు పెన్షన్‌, తదనంతర ఆర్థిక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోలేదు. పెన్షన్‌ తీసుకుంటే వారికి పొడిగింపు ఉత్తర్వులు వర్తించవు. దీంతో అటు పెన్షన్‌ లేక, ఇటు పొడిగింపునకు నోచుకోక ఆర్థికంగా నలిగిపోతున్నారు. కాగా, ఈ మొత్తం వ్యవహారం ఆర్థిక శాఖ కొర్రీలతో ఆగినట్లు తెలిసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఉద్యోగుల విషయంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకోవడంతో వారి వరకు సర్వీసు పొడిగింపుపై ఆర్డినెన్స్‌ జారీ అయింది. యూనివర్శిటీ, గురుకులాల ఉద్యోగులు మాత్రం మిగిలిపోయారు.

ఆలస్యం వెనుక మాస్టర్‌ ప్లాన్‌..!

అయితే ఈ పొడిగింపు ఇవ్వకపోవడం వెనుక మాస్టర్‌ ప్లాన్‌ ఉందన్నది ఉద్యోగుత అనుమానం. పొడిగింపు అమలును ఎంత ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి అంత మేలు జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ ఏడాదంతా ఖాళీగా ఉన్నారు. ఒకవేళ జనవరి 2023 నుంచి 62 ఏళ్ల సర్వీసు ఉత్తర్వులను అమలుచేస్తే వారికి సర్వీసు మరో ఏడాది కాలమే మిగులుతుంది. ఈ మధ్యలో ఖాళీగా ఉన్న ఏడాదిని అసాధారణ సెలవుగా పెట్టుకోవాలి. దీంతో వారికి జీతం చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. కాదని అందుబాటులో ఉండే సుమారు 300 ఆర్జిత సెలవులను వాడుకున్నారా... రిటైర్‌ అయిన తరువాత ఉండే ఎన్‌క్యా్‌షమెంట్‌ సౌకర్యం ఉండదు. ఎలా చేసిన ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోవడం ఖాయం. ఒకవేళ అమలు ఇంకా ఆలస్యమైతే ఇప్పటికే రిటైరయిన చాలా మందికి పొడిగింపు వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురావాలని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు.

Updated Date - 2022-12-30T03:41:32+05:30 IST