విషం తాగుతూ సెల్ఫీ వీడియో!

ABN , First Publish Date - 2022-12-30T03:13:46+05:30 IST

తమ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.

విషం తాగుతూ సెల్ఫీ వీడియో!

వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్సీ ఇక్బాల్‌, మరోనేత వేధిస్తున్నారని ఆరోపణ

చిలమత్తూరు, డిసెంబరు 29: తమ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వైసీపీకి చెందిన ఓ కార్యకర్త సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎమ్మె ల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, వైసీపీ నేత నాగరాజు యాదవ్‌ కారణమని ఆరోపించాడు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం చేనేపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త, ఎఫ్‌పీ షాపు డీలర్‌ చౌడప్ప గురువారం తన పొలంలో విషం తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఎమ్మెల్సీ వ్యతిరేక వర్గంలో తాను ఉంటున్నానని, అందుకే నాగరాజుయాదవ్‌ కక్షగట్టి, చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించాడు. తనకు, హిందూపురానికి చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం ఉందని, ఆ కేసు విచారణ పేరుతో హిందూపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌కు పిలిపించి, బెదిరించారని పేర్కొన్నాడు. అలాగే, చిలమత్తూరు పోలీసు స్టేషన్‌కు ఎస్‌ఐ శ్రీనివాసులు పిలిపించి, గన్‌ చూపి బెదిరించారని, బూతులు తిడుతూ అవమానించారని, అందుకే చనిపోవాలనుకుంటున్నానని చెప్పి..సెల్ఫీ వీడియో ముగించాడు. వెంటనే దాన్ని సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్టు చేశాడు. అది చూసిన కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నాయకులు హుటాహుటిన పొలానికి చేరుకుని, చౌడప్పను చిలమత్తూరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి హిందూపురానికి తరలించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ చిలమత్తూరు మండల పర్యటనలో ఉండటం గమనార్హం. 15 రోజుల క్రితం చిలమత్తూరు మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా నాగరాజు అనే అసమ్మతి కార్యకర్త పెట్రోల్‌ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా చౌడప్ప క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం.

Updated Date - 2022-12-30T03:13:46+05:30 IST

Read more