ఉల్కలు కాదు.. చైనా రాకెట్ శకలాలు!
ABN , First Publish Date - 2022-04-04T16:47:50+05:30 IST
ఉల్కలు కాదు.. చైనా రాకెట్ శకలాలు!

మహారాష్ట్రలో రెండు గ్రామాల్లో ఇనుప వస్తువులు గుర్తింపు
ఆసిఫాబాద్‌లో శనివారంరాత్రి ఆకాశంలో వెలుగులు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ కనిపించిన వైనం
అవి చైనా రాకెట్ శకలాలే: అమెరికా పరిశోధకుడు
న్యూఢిల్లీ,: ఆసిఫాబాద్‌లో శనివారం రాత్రి ఆకాశంలో కనిపించిన ఉల్కాపాతం, నిజానికి చైనా రాకెట్ శకలాలా..? మహారాష్ట్రలో రెండు గ్రామాల్లో తాజాగా వెలుగుచూసిన ఇనుప వస్తువులు, ఇదే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఇవి శనివారం రాత్రి ఆకాశం నుంచి పడ్డాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. చంద్రపూర్ జిల్లాలో లబ్దోరీ, పవన్పర్ గ్రామాల్లో కనిపించిన ఈ వస్తువుల్లో ఒకటి గుండ్రంగా రింగ్‌లా ఉండగా.. మరొకటి సిలిండర్ ఆకారంలో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చంద్రపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హనే విలేకరులకు వెల్లడించారు. ముంబైలోని విపత్తు నిర్వహణ శాఖకు వివరాలను వెల్లడించామని.. త్వరలోనే ఓ బృందం జిల్లాలో పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు. వస్తువులను సేకరించి పరిశీలనకు పంపించామని తెలిపారు. తాము పరిశీలించే సరికి అవి వేడిగా ఉన్నాయన్నారు. మరిన్ని వస్తువులేమైనా ఉన్నాయోమోనన్న అనుమానంతో సమీప గ్రామాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా.. శనివారం రాత్రి ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు మండుతూ భూమిలోకి దూసుకురావడం చూశామని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ వీటిని చాలామంది ఆసక్తిగా తిలకించారు. తాజాగా గుర్తించిన వస్తువులు అవే అయి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. అవి రాకెట్ బూస్టర్లలో వినియోగించే వస్తువులని నిపుణులు చెబుతున్నారు. న్యూజిల్యాండ్ నుంచి శనివారం రెండు ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో గగనతలంలో మండిపోయే బూస్టర్లు భారత్‌లో పడి ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు.. ఇవి చైనాకు చెందిన చాంగ్‌షెంగ్ 3బీ రాకెట్‌కు చెందిన శకలాలని అమెరికా ఖగోళ పరిశోధకుడు జొనాథన్ మెక్‌డవల్ ట్విటర్లో అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసిన రాకెట్, శనివారం రాత్రి భూమిలోకి ప్రవేశించిందని ఆయన తెలిపారు.