కొత్త జిల్లాల్లో రెగ్యులర్‌ పోస్టులేవీ?

ABN , First Publish Date - 2022-12-31T05:11:41+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి తొమ్మిది నెలలవుతున్నా నేటికీ అనేక శాఖల్లో రెగ్యులర్‌ పోస్టుల జాడే లేదు.

కొత్త జిల్లాల్లో రెగ్యులర్‌ పోస్టులేవీ?

మార్కెటింగ్‌శాఖలో సిబ్బంది కొరత.. రైతుబజార్ల సిబ్బందితో పనులు

జిల్లా కేంద్రాల్లో ఉండని కొందరు అధికారులు

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి తొమ్మిది నెలలవుతున్నా నేటికీ అనేక శాఖల్లో రెగ్యులర్‌ పోస్టుల జాడే లేదు. ఆఖరికి ఆదాయం వచ్చే శాఖల్లోనూ అరకొర పోస్టులతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. మార్కెటింగ్‌శాఖలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఏడీఎం, ఒక సీనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుతో పాటు జూనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్ట్‌, అటెండర్లు, రికార్డర్లు ఉండగా.. ఏడీని పాత జిల్లాకు, సీనియర్‌ ఎస్‌ఎంఏని కొత్త జిల్లాకు మార్కెటింగ్‌ అధికారులుగా పంపారు. ఇతర సిబ్బందిని పాత జిల్లాలకే ప్రాధాన్యమిస్తూ, సర్దుబాటు చేశారు. పాత 13జిల్లాల కేంద్రాలకు ఏడీలను నియమించగా, కొత్త జిల్లాలైన అన్నమయ్య, అనకాపల్లి, బాపట్ల, కోనసీమ, మన్యం, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లా, శ్రీసత్యసాయి, తిరుపతి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎస్‌ఎంఏలను జిల్లా మార్కెటింగ్‌ అధికారులుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనీసం ఎస్‌ఎంఏను కూడా ఇవ్వకుండా జూనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ను మాత్రమే కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 20నుంచి 30మధ్యలో రెగ్యులర్‌ సిబ్బంది ఉండగా, కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల్లో కడప, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మాత్రమే 10మంది దాకా రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో ఎక్కడా ఐదారుగురుకు మించి లేరు. కొన్ని చోట్ల ఎస్‌ఎంఏలు కేటాయించిన జిల్లాలకు వెళ్లకుండా, సిఫారసులతో పాత జిల్లాల్లోనే తిష్ట వేశారు. కొన్ని చోట్ల రెగ్యులర్‌ జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, అటెండర్లు లేకుండానే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే జిల్లా కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. కార్యాలయ, రికార్డు పనులను వారితోనే చేయిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా జిల్లా మార్కెటింగ్‌ శాఖ కార్యాలయ అధికారులు తమ పరిధిలోని రైతుబజార్ల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, తమ కార్యాలయ పనులు చేయించుకుంటున్నట్లు చెప్తున్నారు. మార్కెట్‌ కమిటీల్లో ఉన్న సిబ్బందిని పంపేందుకు పాలకవర్గాలు వ్యతిరేకిస్తుండటంతో ఇలా రైతుబజార్లలో ఉండే ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని వాడుకోవడం ఏమిటని ఆయా సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో మార్కెటింగ్‌శాఖ, మార్క్‌ఫెడ్‌ జిల్లా కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో అనేక పనులు నత్తనడక నడుస్తున్నాయని సమాచారం. కాగా, కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌లు తీసుకున్న కొందరు మార్కెటింగ్‌ అధికారులు ఇప్పటికీ ఆయా జిల్లా కేంద్రాల్లో నివాసం ఉండకుండా, ఇతర ముఖ్యపట్టణాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2022-12-31T05:11:42+05:30 IST